Police Focus On Traffic Rules Violations : రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారి భద్రతలో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు తెలంగాణ రవాణాశాఖ అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన వారి లైసెన్సులను సైతం రద్దు చేస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో 70వేల పైచిలుకు పైగా వాహనదారుల లైసెన్సులను రవాణాశాఖ రద్దు చేసింది. ఇలా రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్సుల్లో మందుబాబులవే అధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
మద్యం సేవించి వాహనం నడిపిన వారిపై కఠిన చర్యలు :రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్కరి అజాగ్రత్త ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. కొన్నిసార్లు మనం సరైన మార్గంలో వెళ్తున్నా అవతలి వారి నిర్లక్ష్యం ప్రాణాలను హరిస్తోంది. ఇలా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై రవాణాశాఖ దృష్టిసారించింది. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గడిచిన నాలుగేళ్లలో దాదాపు 70 వేల పైచిలుకు వాహనదారుల లైసెన్సులను రవాణాశాఖ సస్పెండ్ చేసింది. 2024 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ 10వేల 113 లైసెన్స్‌లను సస్పెండ్ చేసినట్లు రవాణాశాఖ వెల్లడించింది. సస్పెన్షన్‌కు గురైన వాటిలో దాదాపు 85శాతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో నమోదైన కేసులే ఉన్నట్లు రవాణాశాఖాధికారులు తెలిపారు.