Massive exodus from YSRCP into TDP:ఓ వైపు నామినేషన్లు, మరోవైపు ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులకు, ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తల చేరికలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనతో విసిగిపోయిన స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నేతలు వరసగా వలస బాట పడుతున్నారు. అభ్యర్థులు వారికి పసుపు కండువాలు కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానిస్తున్నారు. అందరూ కలసికట్టుగా పనిచేసి కూటమి విజయానికి కృషి చేయాలని సూచిస్తున్నారు.
మచిలీపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతున్నాయి. 2019లో కాంగ్రెస్ తరఫున అసెంబ్లీకి పోటీచేసిన చలమల శెట్టి ఆదికిరణ్, కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడకు చెందిన వైసీపీ నేత మండవ వెంకట్రామ్ చౌదరి, విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన 50 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో లోకేశ్ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గుడివాడకు చెందిన వైసీపీ కీలక నేత, నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షుడు దారం నరసింహారావు, కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము సమక్షంలో తెలుగుదేశంలో చేరారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లి ఎంపీటీసీ పుల్లయ్య, కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. నంబులపూలకుంట మండలానికి చెందిన పలువురు పంచాయతీ వార్డు సభ్యులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కుమ్మరవాండ్లపల్లి పంచాయతీలోని బాలప్పగారిపల్లి, మత్తినగారిపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న కందికుంట సమక్షంలో వీరు పార్టీలో చేరారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీకిఎదురుగాలి వీస్తోంది. నందలూరు మండలం చింతకాయలపల్లికి చెందిన 200 కుటుంబాలు వైసీపీను వీడి తెలుగుదేశంలో చేరాయి. రాజంపేట కూటమి అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.