Margadarsi Chit Fund New Branch :రామోజీరావు 88వ జయంతిని పురస్కరించుకుని మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ తెలంగాణలో కొత్తగా మూడు శాఖలను ప్రారంభించింది. వనపర్తి, శంషాబాద్, హస్తినాపురంలో ఏర్పాటు చేసిన శాఖలను సంస్థ ఎండీ శైలజాకిరణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఆరు దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో సేవలు అందిస్తున్న మార్గదర్శి, నేటితో నాలుగు రాష్ట్రాల్లో 118 శాఖలకు విస్తరించింది.
ఇవాళ ఉదయం ముందుగా వనపర్తి జిల్లా కేంద్రంలో :116 శాఖను ఘనంగా ప్రారంభించారు. మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి వర్చువల్‌గా ఈ శాఖను ప్రారంభించారు. నూతన శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శి సంస్థల సీఈఈ మధుసూదన్, వైస్ ప్రెసిడెంట్ బలరామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి శాఖ కార్యకలాపాలను ప్రారంభించారు.
సాయంత్రం 4గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాళ్లగూడలో తమ 117వ శాఖను సంస్థ ఎండీ శైలజా కిరణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వైస్ ప్రెసిడెంట్ రాజాజీతో కలిసి సీఈఓ సత్యనారాయణ, బ్రాంచ్ మేనేజర్ అరుణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. 118వ బ్రాంచ్‌ను రంగారెడ్డి జిల్లా హస్తినాపురంలో మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ వెంకటస్వామి పాల్గొన్నారు.