Lokesh on DSC Notification : రెండో రోజుఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 1998 డీఎస్సీకి సంబంధించిన అంశంపై ప్రశ్నించారు. పలువురు శాసన సభ్యలు దీనిపై ప్రశ్నలు లేవనెత్తారు. వీటికి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఇటీవలే 16,000 పైచిలుకు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. న్యాయవివాదాల పరిష్కారం తర్వాత త్వరలోనే డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని లోకేశ్ వెల్లడించారు.
1998 డీఎస్సీలో ఉత్తీర్ణులైన వారిలో 18,008 మంది నియమితులయ్యారని లోకేశ్ పేర్కొన్నారు. ఆ తర్వాత పెండింగ్లో ఉన్న 4,534 పోస్టుల్లో ఎంటీఎస్ ద్వారా 3939 పోస్టులు భర్తీచేశారని తెలిపారు. ఇంకా 595 పోస్టులు భర్తీచేయాల్సి ఉందన్నారు. ఇంకా ఎక్కువ ఉన్నాయని సభ్యులు చెబుతున్నారని వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పారు. ఎంటీఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని వివరించారు. వారికి రిటైర్మెంట్ వయసు 60సంవత్సరాలని, సభ్యులు లేవనెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ వివరించారు.
AP Assembly Sessions 2024 : మరోవైపు విభజనచట్టం ప్రకారం పెండింగ్లో ఉన్న విద్యాసంస్థలపై శాసనసభ్యులు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమ ప్రశ్నలు అడిగారు. వీటిపై మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ట్రైబల్ వర్సిటీ స్థలం మార్చి ఐదేళ్లు పనులు ముందుకు సాగకుండా జాప్యం చేశారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా తమకు మంచిపేరు వస్తుందని స్థలాన్ని మార్చారని విమర్శించారు. 2019లో నిర్ణయించిన స్థలంలోనే వచ్చే రెండేళ్లలో సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ పూర్తిచేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
2014-19 మధ్య చంద్రబాబునాయుడు అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చారని లోకేశ్ వివరించారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సెక్టార్వైజ్ ఫోకస్ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అనంతపురం జిల్లాకు కియా తెచ్చారని, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, నెల్లూరు విండ్ టర్బైన్, కర్నూలు రెన్యువబుల్ ఎనర్జీ, ఉభయగోదావరిలో ఆక్వా, ఉత్తరాంధ్ర ఐటీ, మెడికల్ డివైస్, ఫార్మా పరిశ్రమలను ప్రోత్సహించారని పేర్కొన్నారు. విభజన చట్టంలో రాష్ట్రానికి కేటాయించిన విద్యాసంస్థలను కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారని లోకేశ్ వెల్లడించారు.