ముక్కలుగా మారి మూల్గుతున్న మంగళగిరి వైఎస్సార్సీపీ - ఆదిపత్యపోరుతో పెరుగుతున్న అసమ్మతి Mangalagiri YSRCP Cadere : రాజధానిలో కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలుగా చీలింది. అధికార పార్టీ శ్రేణులు ఎమ్మెల్యే ఆర్కే, వేమారెడ్డి, చిరంజీవి వర్గాలుగా విడిపోయారు. ఆధిపత్యపోరు, అభివృద్ధి పనులు పక్కనపెట్టడంపై విజయసాయిరెడ్డిని నేరుగానే కొందరు నిలదీశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్సీపీ పరిస్థితి చీలికలుపీలికలైంది. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైెఎస్సార్సీపీని వీడినప్పటికీ ఆయన వర్గం ఒక గుంపుగా, ప్రస్తుత సమన్వయకర్త గంజి చిరంజీవి వర్గం ఇంకో జట్టుగా, తాడేపల్లి-మంగళగిరి నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మరో వర్గంగా చీలిపోయారు.
మూడు గ్రూపులను సమావేశపరిచిన అగ్రనేతలు: బలంగా ఉన్న ఆర్కే వర్గాన్ని అణగదొక్కి తన పరపతి చాటుకునేందుకు వేమారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత సమన్వయకర్త గంజి చిరంజీవి తన బలాన్ని కట్టుదిట్టం చేసుకునేందుకు, పార్టీలోని తన వర్గంలో నియామకాలు చేసుకుంటున్నారు. ఈ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విజయసాయిరెడ్డి, మర్రి రాజశేఖర్ సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో 3గ్రూపుల్ని సమావేశపరిచారు.
పార్టీలో ఉన్నామా లేమా అంటూ నిలదీత : ఎమ్మెల్యే ఆర్కే నియమించిన తాడేపల్లి పట్టణ వైఎస్సార్సీపీ కమిటీని ఇటీవలే వేమారెడ్డి రద్దు చేశారు. తన వర్గీయులు అంజిరెడ్డి అధ్యక్షతన కొత్త కమిటీని ప్రకటించారు. 'అసలు మేము పార్టీలో ఉన్నామా, లేమా అని, ఎవరికి తోచినట్లు వారు కమిటీలను వేసుకుంటూ పోతున్నారు' అని వేమారెడ్డి తొలగించిన తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వేణు, సాయిరెడ్డిని ప్రశ్నించారు.
వేణునే వారి అధ్యక్షుడు అంటూ వేణు వర్గీయుడొకరు కేకలేయగా సాయిరెడ్డి అతడిని గదమాయిస్తూ, ‘ఇలా మీ ఇష్టం వచ్చినట్లు అల్లరి చేయొద్దు. ఏం చేయాలో చూసి మేం నిర్ణయం తీసుకుంటాం’అని మందలించారు. ‘పార్టీలో కమిటీలు వేసే అధికారం తనకూ లేదని, జగన్ వేసేవే పార్టీ కమిటీలని సాయిరెడ్డి స్పష్టం చేశారు. దీంతో వేమారెడ్డి అవమానంగా భావించి కినుక వహించారు. మంగళగిరి పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా ఇటీవల గంజి చిరంజీవి కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడా నియామకం చెల్లుబాటు అవుతుందా కాదా అని సమావేశానంతరం బయటకొచ్చాక నేతలు మాట్లాడుకున్నారు.
అభివృద్ధికై ప్రశ్నించే వారికి సమాధానామేమివ్వాలి : సమావేశంలో భాగంగా అభివృద్ధిని పట్టించుకోకపోవడాన్ని కొందరు నేతలు సాయిరెడ్డిని ప్రశ్నించారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి ఇంటి నుంచి హెలిప్యాడ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న పాత వంతెనకు మరమ్మతు చేస్తామని చెప్పి చాలాకామైందని తాడేపల్లికి చెందిన నాయకులు ప్రస్తావించారు. సీఎం ఇంటి వద్ద వంతెననే పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించేవారికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
వంతెన పూర్తి చేయడానికి ఇప్పుడు సమయం లేదని, ఎన్నికలు పూర్తైన తర్వాతే పనులు పూర్తి చేస్తాం’ అని సాయిరెడ్డి వారికి సమాధానమిచ్చారు. దుగ్గిరాల మండల ఎంపీటీసీలు , సర్పంచులు కూడా ఒక రోడ్డుగానీ, డ్రైన్‌గానీ కట్టలోకపోయామని ఆక్రోశించారు. ఏమీ చేయకుండా ఏ మొహం పెట్టుకుని జనాన్ని ఓట్లు అడగాలని గట్టిగానే నిలదీసినట్లు తెలిసింది.
నచ్చచేప్పేందుకు ప్రయత్నించిన సాయిరెడ్డి : శ్మశాన వాటికకు ఎంపీ నిధులు కేటాయిస్తానని సాయిరెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, ఆ నేతలు వెనక్కుతగ్గలేదు. నామినేటెడ్ పదవుల ఆశచూపి ఎవరికీ ఇచ్చింది లేదని, కొందరు ఎంపీటీసీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు ప్రశ్నించగా ఎవరెవరికి ఏం కావాలో అన్నీ రాసి ఇస్తే అందిరికీ న్యాయం జరిగేలా చూసుకుంటా అని సాయిరెడ్డి వారికి నచ్చజెప్పారు.