ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంగళగిరిలో కూటమి విజయం ఖాయమే- మెజార్టీపైనే జోరుగా చర్చ! - MANGALAGIRI CONSTITUENCY

Mangalagiri Assembly Constituency Review : సార్వత్రిక ఎన్నికల్లో అందరి చూపూ మంగళగిరి వైపే. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే సర్వేలన్నీ ఇక్కడ జెండా పాతేది తెలుగుదేశం అనేది స్పష్టం చేస్తున్నాయి. అందుకే లోకేశ్ గెలుపు కంటే మెజార్టీ ఎంతనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. లోకేశ్​ను ఓడించేందుకు వైఎస్సార్సీపీ సర్వ శక్తులూ ఒడ్డుతోంది. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ చేనేత కుటుంబానికి చెందిన మురుగుడు లావణ్యను బరిలోకి దించింది. వైసీపీలో కుమ్ములాటలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ఆ ఫార్ములా ఎంతవరకు పని చేస్తేందనేది ప్రశ్నార్థకమే.

Mangalagiri Assembly Constituency Review
Mangalagiri Assembly Constituency Review (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 8, 2024, 6:54 PM IST

Mangalagiri Assembly Constituency Review : మంగళగిరి అంటే ఠక్కున గుర్తొచ్చేది చేనేతలు. సంప్రదాయ చేనేత కళకు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలో 2లక్షల 92వేల మంది ఓటర్లు ఉండగా పురుషులు లక్షా 40వేల 660 కాగా మహిళలు లక్షా 51వేల 759 మంది ఉన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. 2019లో లోకేశ్ ఇక్కడి నుంచే పోటీ చేశారు. అయితే పోటీ విషయంలో చివరి నిమిషం వరకు ఉన్న సందిగ్ధత, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ గాలి ఉండటంతో ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి ఇక్కడి నుంచే తలపడుతున్నారు. మంగళగిరి నుంచి కాకుండా వేరే చోట పోటీ చేయాలని సన్నిహితులు సూచించినా లోకేశ్ వినలేదు. పోయిన చోటే వెదుక్కోవాలన్న నానుడితో లోకేశ్ కార్యక్షేత్రంలోకి దిగారు. నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ప్రజలకు ఏం చేయాలని ఆలోచించారు.

వైసీపీ అభ్యర్థికి షాక్‌ - లోకేశ్​కే ఓటు వేస్తామన్న మంగళగిరి ఓటర్లు - Shock to Mangalagiri YCP Candidate

వ్యక్తిగత నిధులతో 27 సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన లోకేశ్ :మంగళగిరిలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గ్రౌండ్‌ వర్క్ చేశారు. లోకేశ్ వేరేచోటికి వెళ్లినా ఇక్కడ కార్యకర్తలకు, ప్రజలకు ఏం కావాలో కనుక్కుని వారి అవసరాలు తీర్చటమే ఈ బృందం పని. వ్యక్తిగత నిధులతో 27 రకాల సంక్షేమ కార్యక్రమాలను లోకేశ్ అమలు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు అండగా తోపుడుబండ్లు ఉచితంగా అందించారు. అంతేకాదు స్త్రీ శక్తి పేరుతో మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. మంగళగిరి చేనేతలకు అండగా ఉండేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. మోడల్ వీవర్ షెడ్ ఏర్పాటు చేసి చేనేతల్లో కొత్త డిజైన్లు, ఆధునిక మగ్గాలపై శిక్షణిస్తున్నారు.

మంగళగిరిలో కూటమి విజయం ఖాయమే- మెజార్టీపైనే జోరుగా చర్చ! (ETV BHARAT)

ప్రజలు ఓడించిన నియోజకవర్గాన్ని మాత్రం వదిలి పెట్టలేదు :అధికారంలో లేకపోయినా నారా లోకేశ్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. లోకేశ్ తోపాటు ఆయన సతీమణి బ్రాహ్మణి కూడా విస్తృతంగా పర్యటిస్తూ నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నారు. మంగళగిరిని మోడల్ నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యమని లోకేశ్ చెబుతున్నారు. మంగళగిరిలో వైఎస్సార్సీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే ఆర్.కెను కాదని మురుగుడు లావణ్యను పోటీలో పెట్టారు. ఆమె మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె, మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు. చేనేత సామాజికవర్గానికి గాలం వేసేందుకు లావణ్యకు జగన్ అవకాశం కల్పించారు. గంజి చిరంజీవి కొంతకాలం వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. టికెట్ కూడా తనకే వస్తుందని భావించారు. చిరంజీవిని వ్యతిరేకించి వైఎస్సార్సీపీకు రాజీనామా చేసిన ఆళ్ల ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. కొద్దిరోజులకే మళ్లీ వైఎస్సార్సీపీ గూటికి చేరారు. వచ్చీ రాగానే గంజి చిరంజీవిని తప్పించి లావణ్య పేరును తెరపైకి తీసుకురావటంలో కీలకంగా వ్యవహరించారు. నమ్మించి మోసగించడంతో అధిష్ఠానంపై గంజి చిరంజీవి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గంజి చిరంజీవి సహాయ నిరాకరణ లావణ్యకు పెద్ద మైనస్ గా మారింది. మంగళగిరి-తాడేపల్లి నగర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వేమారెడ్డి కూడా ఆళ్లకు వ్యతిరేకంగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బాధ్యతలు మొత్తం భుజంపై వేసుకున్నారు. అయితే ఆర్​.కె పదేళ్లుగా నియోజకవర్గానికి చేసిందేం లేదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

'లోకేశ్​ను గెలిపించండి'- మంగళగిరిలో ఎన్టీఆర్ కుటుంబం ఎన్నికల ప్రచారం

వైఎస్సార్సీపీ అనాలోచిత నిర్ణయాలతో మంగళగిరి సర్వ నాశనం : మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాలు ఉన్నాయి. మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని 11 గ్రామాలు రాజధాని అమరావతి పరిధిలోకి వస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసి మూడు రాజధానుల నాటకానికి తెరలేపింది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో మంగళగిరి తీవ్రంగా నష్టపోయింది. స్థిరాస్తి రంగంపైప్రతికూల ప్రభావం పడి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజధాని ఉద్యమంలో వీరూ భాగస్వామ్యులయ్యారు. తాడేపల్లి మండలంలో U1 జోన్ అంశంలోనూ జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. U1 జోన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రైతులంతా తెలుగుదేశంలో చేరి లోకేశ్​కు జైకొట్టారు.

వైఎస్సార్సీపీకు ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం : మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని సైతం జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. చేనేత సొసైటీలకు ప్రభుత్వ బకాయిలు పేరుకుపోవటం, రాయితీలు రాకపోవటంతో నేతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో వైఎస్సార్సీపీ సర్కార్ అరాచకం అంతాఇంతా కాదు. జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారంటూ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. రోడ్ల విస్తరణ పేరిట జనసేన వర్గీయుల ఇళ్లను కూల్చివేసింది. ఇలా వివిధ అంశాలు అధికార పార్టీకి ప్రతికూలంగా మారాయి. రైతులు, కాపులు, చేనేతలు ఇలా అన్నివర్గాల్లోనూ ప్రభుత్వంపై అసంతృప్తి గూడు కట్టుకుంది. ఎలాగైనా వైఎస్సార్సీపీకు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎదురుచూస్తున్నారు.

పలకరిస్తూ, ప్రజా సమస్యలను తెలుసుకుంటూ- ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి

ABOUT THE AUTHOR

...view details