MRO Building In Dilapidated Condition :ఎప్పుడు ఊడిపడుతుందో తెలియని పైకప్పు. వర్షపునీటితో నాచు పట్టిన గోడలు, చదలు పడుతున్న విలువైన దస్తావేజులు, పలిగిపోయి నడిచేందుకు ఇబ్బందిపడేలా టైల్స్, ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యే పాములు, తేళ్లు, ఇరికిరుకు గదులు ఆవరణంతా గడ్డిగ్రాసంతో పనికిరాని మొక్కలు శిథిలావస్థకు చేరిన చేరిన పాడుపడ్డ భవనం. ఇదీ ఆదిలాబాద్ జిల్లా మావల తహసీల్దార్ కార్యాలయం దుస్థితి.
పెచ్చులు ఊడి- శిథిలావస్థకు చేరుకుని :ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా ఉన్నప్పుడు 52 మండలాలుండేవి. జిల్లాల పునర్విభజనతో మండలాల సంఖ్య 66కు చేరింది. అందులో ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఆనుకొని ఉన్న ఇదిగో ఈ మావల మండలం ఒకటి. కొత్త మండలాలు ఏర్పాటుచేసిన అప్పటి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారయంత్రాంగం ఓ పాడుబడిన ఈ క్వార్టర్‌లో తాత్కాలికంగా తహసీల్ధార్ కార్యాలయాన్ని ఏర్పాటుచేసింది. రూ. వందల కోట్ల విలువైన ప్రభుత్వ/ప్రైవేటు భూములు కలిగిన మావల తహసీల్ధార్ కార్యాలయ విస్తీర్ణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది.
"ఇది చాలా పురాతన భవనం. రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడితే పెచ్చులు ఊడుతుంటాయి. విష సర్పాల బెడద ఎక్కువగా ఉంది. వర్షాలు ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళా సిబ్బందికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటోంది. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల మహిళా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు" - వేణుగోపాల్, తహసీల్దార్, మావల