Actor Mohan Babu Complaint on Manchu Manoj : గత రెండు రోజులుగా మంచు కుటుంబంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మోహన్‌బాబు, మనోజ్‌ల ఫిర్యాదులతో గొడవలు బహిర్గతమయ్యాయి. మొదట మనోజ్‌కు మోహన్‌బాబుకు మధ్య ఘర్షణ జరిగిందంటూ ఆదివారం విస్తృతంగా ప్రచారం జరిగినా మోహన్‌బాబు దాన్ని ఖండించారు. అయితే అనూహ్యంగా సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకువచ్చింది. హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మంచుటౌన్లో పదేళ్లుగా నివాసం ఉంటున్న చిన్నకుమారుడు మనోజ్ యాధృచ్చికంగా తన ఇంటి నుంచి వెళ్లిపోయి నాలుగు నెలల క్రితం మళ్లీ తిరిగొచ్చాడని మోహన్‌బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మనోజ్ తను నియమించుకున్న కొందరు అసాంఘిక శక్తులతో కలిసి ఈ నెల 8న తన ఇంట్లో అలజడి సృష్టించాడని, ఆ తర్వాత అతడి ఏడు నెలల శిశువుని పనిమనిషి సంరక్షణలో ఉంచి భార్య మౌనికతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడని మోహన్‌బాబు ఫిర్యాదులో తెలిపారు. ఆ తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి అదే రోజు ఇంటికి తిరిగొచ్చాడని, మరుసటి రోజు తెల్లవారుజామున రోజువారీ పనుల్లో భాగంగా బయటికి వెళ్తున్నప్పుడు ఇంటికి సమీపంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తుల్ని గమనించానన్నారు. మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్లిన తర్వాత మనోజ్ అనుచరులు దాదాపు 30 మంది జల్పల్లిలోని నివాసంలోకి బలవంతంగా చొరబడినట్లు తెలుసుకున్నానని, అక్కడుండే సిబ్బందిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారన్నారు.
'ఎవరి పేర్లు నమోదు చేయలేదు. గుర్తుతెలియని పది మంది అని ఫిర్యాదులో రాశారు. కుటుంబసభ్యులు, మోహన్‌బాబు పేర్లు ఫిర్యాదులో లేవు. ఎందుకు దాడి చేశారు అని తెలియదని, తనకు తన పిల్లలకు ప్రమాదం ఉందని చెప్పారు. సీసీటీవీ కెమెరాలను విజయ్ రెడ్డి, కిరణ్ మాయం చేసినట్లు చెప్పారు'-గురువారెడ్డి, ఇన్స్పెక్టర్, పహాడీషరీఫ్
పహాడీషరీఫ్ పీఎస్‌లో మనోజ్ ఫిర్యాదు :ఇంటి నుంచి శాశ్వతంగా బయటకు పంపించాలని చూస్తున్నారని, ఇంట్లో ఉన్న సంఘ విద్రోహ శక్తులు తనతో పాటు అక్కడున్నవారికి ప్రాణహాని చేస్తారనే భయం కలుగుతోందని మోహన్‌బాబు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిణామాల దృష్ట్యా మనోజ్, మౌనిక వారి సహాయకుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇంటి నుంచి వారందరినీ ఖాళీ చేయించాలని, తగిన భద్రత కల్పించడంతో పాటు ఇంట్లోకి భయం లేకుండా ప్రవేశించేందుకు తోడ్పాటు అందించాలని మోహన్‌బాబు రాచకొండ సీపీకి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు. మరోవైపు తనపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని నటుడు మంచు మనోజ్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కుటుంబ గొడవలు మరింత రచ్చకెక్కాయి.