Manchu Manoj comment on joining Janasena:రాజకీయ పార్టీలో చేరే విషయం గురించి సినీ నటుడు మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనోజ్ జనసేన పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంలో ఆయన ఆళ్లగడ్డ పర్యటన సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
మనోజ్ ఏమన్నారంటే: ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్, నాగ మౌనిక రెడ్డి దంపతులు శోభా ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు. ఎంతో కాలంగా ఆళ్లగడ్డకు రావాలని అనుకున్నామని, ఇవాళ తమ అత్తమ్మ జయంతి సందర్భంగా వచ్చినట్లు మనోజ్ చెప్పారు. ఆళ్లగడ్డ ప్రజలు తమకు ఘన స్వాగతం పలికి ఎంతగానో ఆదరించారని తెలిపారు. జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల గురించి విలేకరి ప్రశ్నించారు. ఇప్పుడు దాని గురించి తాను ఏమీ మాట్లాడనని మంచు మనోజ్ తెలిపారు.
"ఈ రోజు మా అత్తగారి జయంతి సందర్భంగా ఇక్కడకి వచ్చాము. అందుకోసమే మొదటిసారి మా కుమార్తె దేవసేన శోభను ఆళ్లగడ్డకి తీసుకొచ్చాం. జయంతి రోజు తీసుకొద్దామనే ఇన్నాళ్లూ ఇక్కడకు తీసుకొని రాలేదు. మా కుటుంబం, సోదరులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఇక్కడకు వచ్చాను. ఊళ్లో ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. రాయలసీమ నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్"- మంచు మనోజ్, నటుడు