Man Died in His House Dead Body Was in The House for Five Days in Prakasam District :అతడికి ఓ కుటుంబం ఉంది. ఆస్తి, ఆదరణ అన్నీ ఉన్నాయి. అతను ఒకప్పుడు బాగా బతికారు. కానీ అదంతా గతం విధి వక్రీకరించి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత అయినవారికి తానే దూరంగా ఉంటున్నారు. ఒంటరిగా బతుకీడుస్తున్నారు. అందరూ ఉన్నా ఒకప్పుటి జీవితాన్ని కోల్పోయానన్న మనోవేదన అతడ్ని మానసికంగా కుంగదీసింది.
కుటుంబంతో, సంఘంలో ఉండలేక వేరే చోట ఉన్న సొంత ఇంట్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం ఎవరికీ తెలియలేదు.ఎందుకంటే అతడెప్పుడోగానీ బయటకొచ్చింది లేదు. ఇప్పుడది ఎవరికీ అనుమానాస్పదముగానో కొత్తగానో తోచలేదు. దీంతో అయిదు రోజులపాటు అతని మృతదేహం ఇంట్లోనే ఉండిపోయింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో సోమవారం వెలుగు చూసింది.
గ్రామీణ ఎస్సై అంకమ్మరావుతో పాటు గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన గుంటక సత్యనారాయణ(75)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సత్యనారాయణకు అటు గ్రామంలో, ఇటు పట్టణంలో ఆస్తిపాస్తులు ఉన్నాయి. రాయవరంలో బియ్యం మిల్లు కూడా నిర్వహించారు. అనంతర కాలంలో ఇతరులకు విక్రయించారు. అప్పటి నుంచి ఆయన గ్రామస్థులకు, భార్యా బిడ్డలకు దూరంగా మసలసాగారు.హోటళ్ల నుంచి భోజనం తెచ్చుకుని తింటూ గ్రామంలోని సొంత ఇంట్లో ఒంటరిగా జీవనం గడుపుతున్నారు.