Massive Fire Accident at Nandigama Pharma Company :రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆల్విన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ మంటలు వ్యాపించాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి. దీంతో మళ్లీ అగ్ని కీలలు చెలరేగాయి. ఉదయం కంపెనీలో మంటలార్పిన తర్వాత మళ్లీ వ్యాపించడంతో రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలకు పరిశ్రమ సిబ్బంది ఎవరినీ అనుమతించట్లేదు. పాత జాతీయ రహదారిని ఒకవైపు మూసివేసి మరోవైపు నుంచి వాహనాల రాకపోకలను కొనసాగిస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
అసలేం జరిగిందంటే? :నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ పరిశ్రమలో శుక్రవారం వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది. వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు చెలరేగి కెమికల్ మందులపై పడటంతో అక్కడ మంటలు చెలరేగాయని కార్మికులు తెలిపారు. అదేవిధంగా మందుల తయారీలో వాడే ఆల్కహాల్ సైతం 15 బ్యారెల్స్ అక్కడ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో సుమారు 150కి పైగా కార్మికులు ఉండగా, ప్రాణభయంతో చాలా మంది బయటకు పరుగులు తీశారు. అయితే దట్టమైన పొగ అలుముకోవటంతో ఎటూ వెళ్లలేక సుమారు 50 మంది వరకు లోపలే చిక్కుకుపోయారు.
Fire Accident in Pharma Company : పెద్ద పెద్ద శబ్దాలతో మంటలు ఎగిసిపడుతుండడంతో పోలీస్ సిబ్బంది పరిశ్రమ పరిసరాల్లోకి ప్రజలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరిశ్రమ సమీపంలో ఉన్న కుటుంబాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగించే రసాయన డ్రమ్ములను కార్యాలయంలో, పరిశ్రమలో ఉంచడంతో మంటలు తగ్గలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. మంటలను ఆర్పేందుకు వాయువు, నీళ్లు చల్లుతున్న అవి పెరుగుతున్నాయే తప్పా తగ్గలేదని ఓ అగ్నిమాపక అధికారి చెప్పారు. రసాయన డ్రమ్ములు పూర్తిగా కాలిపోయిన తర్వాతనే ఏమైనా చేయవచ్చని వివరించారు. దాదాపు 28 గంటలు గడుస్తున్న మంటలు మాత్రం ఆగకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.