Educational Institutions In Mahbubnagar :రాష్ట్రవ్యాప్తంగా విద్యాపరంగా అత్యంత వెనకబడిన ప్రాంతం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా. ఇక్కడ జాతీయ విద్యాసంస్థల అవసరం, వాటిని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నా ఏళ్లుగా అవి అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వ హాయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీలు, వనపర్తిలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల మంజూరయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన కళాశాలలు అక్కడ ఉన్నాయి.
ఇటీవలే కొండగల్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజినీరింగ్, మెడికల్, పశువైద్య కళాశాలలు సైతం మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా విద్యాసంస్థలు ఏర్పాటు అవుతున్నా కేంద్ర విద్యాసంస్థలు మాత్రం ఇక్కడకు రావడం లేదు. రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మాత్రమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఉంది.
Mahabubnagar Locals Demand For NIT :మరో కళాశాలను విద్యాపరంగా వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉన్నా ఎవ్వరూ పట్టించుకొవడం లేదు. దీనిపై కేంద్రానికి వినతులు వెళ్లగా ఇటీవలే ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఎన్ఐటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా మహబూబ్‌నగర్ ఎన్ఐటీని ఏర్పాటు కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని పాలమూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Central Govt Grants Rs.100cr : కాగా ప్రధానమంత్రి ఉచ్చత్తర్ శిక్షా అభియాన్ మల్టీ డిసిప్లీనరీ రీసెర్చ్ యూనివర్సిటీ విభాగం భాగం కింద హబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయానికి కేంద్రం రూ.100కోట్లు మంజూరు చేసింది. కేంద్రానికి పంపిన ప్రతిపాదనల ప్రకారం ఈ గ్రాంట్‌లో ఎక్కువ భాగం దాదాపు 80 కోట్ల రూపాయలు కొత్త నిర్మాణాలకు, రూ.14 కోట్లు పరిశోధనా సౌకర్యాలకు,రూ.5 కోట్లు పునరుద్ధరణలకు, రూ. 3 కోట్లు సాఫ్ట్ కాంపోనెంట్‌లకు వినియోగించనున్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు తప్ప మహబూబ్‌నగర్ జిల్లాకు ఎలాంటి విద్యాసంస్థలు రాలేదు.
రెండు చోట్లైనా కేవీలు ఏర్పాటు చేయాలి : పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తగా ఏర్పడిన 7జిల్లాల మధ్య విడిపోయింది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పడ్డాయి. అన్ని జిల్లాలకు కలిపి కేంద్రీయ విద్యాలయం(కేవీలు) ఒక్కటే ఉంది. 5 జిల్లాల్లో ఒకటి, రెండు చోట్లైనా కేంద్రీయ విద్యాలయాలు రావాలని జనం కోరుతున్నారు. పదేళల్లో ఆ దిశగా అడుగులు పడకా జవహర్ నవోదయ విద్యాలయం నాగర్ కర్నూల్ జిల్లాలో మాత్రమే ఉంది. అక్షరాస్యత పరంగా వెనకబడిన జోగులాంబ గద్వాల, నారాయణపేట లాంటి జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేస్తే. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్ధులకు ఉచిత విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.