Maha Shivaratri 2024 Celebrations :రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం మహాశివరాత్రి వేడుకలు జరగనున్నాయి. ముక్కంటిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే దేవాలయాలకు తరలిరానున్నారు. ఇందుకోసం శైవ క్షేత్రాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాత్రికి శేష వాహనం సేవ : దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమ స్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి హంస, చిలుక వాహనాలను అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం వేద పండితుల మంత్రోచారణల మధ్య ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఆది దంపతులను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో శ్రీకాళహస్తీశ్వరలయం భక్త జనసంద్రంగా మారింది. శివనామ స్మరణతో మార్మోగింది. రాత్రి శేష వాహనం సేవ జరగనున్నది.
మహాశివరాత్రి పర్వదినం.. ముక్కంటి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
అధిక సంఖ్యలో ఆలయాలకు పయనమైన భక్తులు : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరలయంలో ఏర్పాటు చేసిన భూకైలాస్ సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయానికి సమీపంలోని స్వర్ణముఖి నది తీరాన శివపార్వతులతో పాటు, మంచు పర్వతంతో కూడిన భూకైలాస్ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకునే భక్తులు ముందుగా ఈ దేవతామూర్తుల చిత్రాల ఏర్పాటును దర్శించుకుంటున్నారు. సమీపంలోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడంతో భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మహాశివరాత్రి, రథోత్సవం, కళ్యాణోత్సవ రోజున అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి రానున్నడంతో శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీ సీడ్స్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద వాహనాల నిలిపే విధంగా చర్యలు చేపట్టారు. భక్తులకు ఉపయోగకరంగా రైల్వే స్టేషన్, బస్టాండ్లకు ఆలయం తరఫున ఉచిత బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
మహాశివరాత్రి సందర్భంగా వీరభద్రునికి అలుగుల సంబరం
మహనందిలో తొలి రోజు ధ్వజారోహణ కార్యక్రమం : నంద్యాల జిల్లా మహనందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 11 వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు మహానందీశ్వర స్వామిని మయురా వాహనంపై ఊరేగించారు. ఆలయ ఆవరణలో ధ్వజస్తంభం వద్ద వేద పండితుల మంత్రచ్ఛరణలతో ఈ ఊరేగింపు సాగింది. బ్రహ్మోత్సవంలో భాగంగా లింగోద్భవం,లోక కల్యాణం, రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు తదితర ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ కార్యనిర్వహణాధికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు వెండి అంబారి ఉత్సవం