Magic Bus International NGO Helping Poor Girls in Kurnool :పేదింటి అమ్మాయిలైనా చదువుకోవాలి, కెరీర్‌లో రాణించాలనే లక్ష్యాలు వీరివి. కానీ, వ్యవసాయ నేపథ్యం, ఆర్థిక పరిస్థితుల కారణంగా కెరీర్‌కు స్వస్తి చెప్పి ఇంటికే పరిమితం అయ్యారు. అయినా స్వశక్తిగా ఎదగాలనే సంకల్పంతో చిన్ననాడే ప్రయత్నాలు మెుదలు పెట్టారు. వీళ్ల ఆసక్తికి అండగా నిలబడుతోంది. మ్యాజిక్ బస్ అనే స్వచ్ఛంద సంస్థ. దీని సాయంతో నైపుణ్యాలు నేర్చుకుంటూ కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు ఈ అమ్మాయిలు.
కర్నూలు వెనకబడిన జిల్లాగా పేదరికం అధికంగా ఉన్న ప్రాంతంగా ఉంటుంది. ఇలాంటి చోట ఆడపిల్లలపై వివక్ష సైతం కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. అమ్మాయిలకు చదువులు ఎందుకని, ఒకవేళ చదివించినా పదో, ఇంటర్ వరకో చదివించటం, ఆ తర్వాత పెళ్లి చేసి పంపించేయటం ఇక్కడ మామూలే. అయితే ఇలాంటి ఎంతో మంది యువతులకు మ్యాజిక్ బస్ అనే సంస్థ అండగా నిలుస్తోంది. 7 దేశాల్లో పని చేస్తున్న ఈ సంస్థ కర్నూలులో గత 14 ఏళ్లుగా యువతులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పిస్తోంది.
'మ్యాజిక్ బస్ అనే సంస్థ ఇప్పటి వరకు సుమారు వెయ్యి మందికి పైగా యువతులకు ఉపాధి అవకాశాలు కల్పించింది.18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉండి, కనీసం పదో తరగతి పాసై ఇంటి వద్ద ఖాళీగా ఉండి, ఉద్యోగం అవసరమైన యువతులకు శిక్షణ ఇస్తారు. సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు తీసుకువెళితే మొదట కౌన్సిలింగ్ ఇచ్చి, తర్వాత జాయిన్ చేసుకుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌సహా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.' -శిక్షణ తీసుకుంటున్న యువతి
చదువుతోపాటు ఆసక్తి ఉన్న వారికి క్రీడల్లోనూ శిక్షణ ఇస్తోంది మ్యాజిక్ బస్ సంస్థ. ఇంట్లో, సమాజంలోని పరిస్థితులను తట్టుకునేలా కౌన్సిలింగ్‌లు ఇచ్చి, మనోధైర్యాన్ని నింపుతారు. ఇలా మొత్తం 45 రోజులపాటు ట్రైనింగ్ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి ఎన్ఐఐటీ ద్వారా పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్ ఇస్తారు. బయట సంస్థలతో మాట్లాడి అభిరుచికి తగ్గట్లు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.