LOTUS FLOWERS IN SUMMER: ఎండలు దంచికొడుతున్నాయి. దీనికితోడు అది అసలే కరవు జిల్లా. గత ఎడాది అక్కడి ప్రజలు చుక్క నీరు కోసం అల్లాడిపోయారు. కానీ సంవత్సరం తిరిగేసరికి అక్కడి చెరువులు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మండుటెండలో వికసించిన తామరలను చూడటానికి రెండు కళ్లూ సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదు. అంత అందంగా ఉన్నాయి ఆ కమలాలు. ఇంతకీ ఇవి ఎక్కడ ఉన్నాయో చెప్పలేదు కదూ. అ వివరాలే ఇప్పుడు చూద్దాం.
కరవు నేల అనంతపురం జిల్లాలోని చెరువుల్లో వేసవిలో తామర (కమలం) పూల వికాసం కనువిందు చేస్తున్నాయి. అనంతపురం నగరాన్ని ఆనుకుని ఉన్న బుక్కరాయసముద్రం చెరువు వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో గత ఏడాది నవంబరు వరకు చుక్క నీరు కూడా లేదు. తరువాత కురిసిన వర్షాలకు చెరువులు నిండాయి. దీంతో ప్రస్తుతం నీటితో చెరువు జలకళ సంతరించుకుంది. నిండుగా నీళ్లు ఉండటంతో, తామర పూలు పూశాయి. చెరువులో దాదాపు సగభాగం వరకూ తామర తీగలు అల్లుకున్నాయి. నీటిపై తేలియాడే ఆకుల మధ్య వందల సంఖ్యలో తామర పూలు చూపరులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.