Lorry Accident in Rangareddy District Telangana : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. హైదరాబాద్-బీజాపుర్ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దూసుకొస్తున్న లారీని చూసి అక్కడి జనమంతా భయంతో పరుగులు తీశారు.
వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ చెట్టును ఢీ కొట్టి ఆగింది. లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో అన్‌లోడ్ చేసి తిరిగి వికారాబాద్ వెళ్తున్న క్రమంలో లారీ అదుపుతప్పడంతో ఈ ఘటనకు చోటుచేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో హైదరాబాద్- బీజాపుర్ రహదారిపై భీతావహ వాతావరణం నెలకొంది.
లారీ సృష్టించిన బీభత్సంలో మృతులను రాములు (ఆలూరు), ప్రేమ్ (ఆలూరు), సుజాత (ఖానాపూర్)గా గుర్తించారు. ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాదాపు వంద మీటర్ల దూరం నుంచే లారీ అదుపు తప్పిన విషయాన్ని గమనించిన కూరగాయల వ్యాపారులు పరుగులు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు కూలిన చెట్టును జేసీబీతో పక్కకు తొలగించారు.