AP Liquor Shops Application Process :రాష్ట్రం ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రైవేటుగా ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో.. వాటిని దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఈ రంగంలో అనుభవం లేనివారు కూడా దరఖాస్తులు చేస్తున్నారు. అలాంటి వారిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, వైద్యులు, ఆడిటర్లు, కాంట్రాక్టర్లు ఉన్నారు. స్వయంగా కార్యాలయాలకు వచ్చి దరఖాస్తు చేసే విషయమై సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.
దుకాణాల కోసం దరఖాస్తుల ప్రక్రియ :ఒక్కో మద్యం షాపునకు ప్రస్తుతం దాఖలు అవుతున్న దరఖాస్తులను పరిశీలిస్తే అంచనాలు మించి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, పొన్నూరు తదితర నగరాల్లో సగటున ఒక్కో షాపునకు 10కి పైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఎవరైతే మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నడిపారో వారే దరఖాస్తులు చేసుకుంటారని ఎక్సైజ్ అధికారులు భావించారు. తాజాగా వస్తున్న దరఖాస్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
పోటెత్తుతున్న దరఖాస్తులు :గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎక్సైజ్ యంత్రాంగం సాధ్యమైనంత ఎక్కువ మందితో దరఖాస్తులు చేయించేలా అవగాహన కల్పించారు. దరఖాస్తు రుసుముల ద్వారా ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం తెచ్చిపెట్టాలని అధికారులు యోచిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్దేశించిన బ్రాండ్లు మాత్రమే షాపుల్లో ఉండేవి. దీంతో పక్క రాష్ట్రాల నుంచి మద్యం బాగా వచ్చేంది. కానీ కూటమి ప్రభుత్వం నూతన పాలసీలో అన్ని రకాల బ్రాండ్లు, తక్కువ ధరలకే లభ్యమయ్యేలా అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.
మద్యం దుకాణాలకు ఫుల్ డిమాండ్ - 3 రోజుల్లోనే వేల సంఖ్యలో దరఖాస్తులు! - AP Liquor Policy 2024