Heavy Rain Effect in Hyderabad : హైదరాబాద్ నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్, మల్కాజిగిరిలలో, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి రేకులు, గుడిసెలు ఎగిరిపోయాయి.
Two Persons Killed in Tree Fall Incidents :మరోవైపు మేడ్చల్ జిల్లా కీసర మండలంలోనూ గాలులు ఉద్ధృతంగా వీచాయి. తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట్ వెళ్లే దారిలో, గాలి దుమారంతో కూడిన వర్షాల కారణంగా రోడ్డుపక్కన చెట్లు విరిగిపడి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిపై కొమ్మ పడటంతో, అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
అదే వాహనంపై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, స్థానికులు చికిత్సా నిమిత్తం ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రామ్‌రెడ్డి(48), ధనుంజయ(45) లుగా పోలీసులు గుర్తించారు.
GHMC Officials Alert on Heavy Rains :మృతులు శామీర్ పేటలోని ఓ న్యాయవాదిని కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ ఘటనలో గణేశ్ దేవాలయం ప్రాంగణంలోని చెట్టు పడడంతో కారు, ఆటో స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.