Lawyer Srinivasulu Meet JC Prabhakar Reddy to Join TDP :వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నోరుపారేసుకున్నాడు. నోరు ఉంది కదా అని తెలుగుదేశం నేతలపై విరుచుకుపడ్డాడు. కట్ చేసి చూస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరుతానని ప్రాధేయపడుతున్నాడు. పార్టీలోకి చేర్చుకోవడం కుదరదని చెప్పినా వినకపోవడంతో కార్యకర్తలు ఎత్తుకెళ్లి బయట వేశారు. వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అండతో న్యాయవాది శ్రీనివాసులు టీడీపీ నేతలను నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఇప్పుడు టీడీపీలో చేరేందుకు వచ్చి నెట్టేయపడ్డాడు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదైన కేసులను న్యాయవాది శ్రీనివాసులే వాదించేవారు. ఆయన వైఎస్సార్సీపీ కండువా కప్పుకుని జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటంపై అప్పట్లో స్థానికంగా చర్చ జరిగింది. అశోక్ లైలాండ్ వాహనాల కేసుల విషయంలో జేసీ చాలా తప్పులు చేశారని, జైలుకు వెళ్లక తప్పదంటూ శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అప్పట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి అండతో ఆయన రెచ్చిపోయాడు. ఇప్పుడు రెండు చేతులు జోడించి తన తప్పును మన్నించాలని జేసీ ముందు న్యాయవాది శ్రీనివాసులు వేడుకున్నారు. తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ప్రాధేయపడ్డారు.