Lanka People Suffering From Godavari Floods:గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. అఖండ గోదావరి తీరం ప్రమాదకరంగా మారింది. భారీగా వరద జలాల రాకతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 15 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో లంక గ్రామాలు ముంపులోనే చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కోనసీమ జిల్లాలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మరికొన్ని రోజులు వరద ప్రవాహం కొనసాగే అవకాశలుండటంతో బాధిత గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
గోదావరి వరద మళ్లీ పుంజుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో లంక గ్రామాల ప్రజల కష్టాలు అధికమవుతున్నాయి. కొద్ది రోజులుగా వరద నీటితోనే సావాసం చేస్తున్న లంక గ్రామాల వాసులు పెరుగుతున్న ప్రవహంతో బిక్కుబిక్కుమంటున్నారు. సీలేరు, శబరి పరీవాహకాలు భారీ వరద నీటితో గోదావరిలో చేరడంతో వరద ఉద్ధృతి మరికొన్ని ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలీన మండలాలను వరద నీరు విడవడం లేదు.
పొంగుతున్న గోదావరి, శబరి- నీట మునిగిన ఇళ్లు, పొలాలు - GODAVARI FLOOD
కోనసీమ జిల్లాలో గౌతమి గోదావరి, వశిష్ట, వైనతేయ గోదావరి పాయలు ఉగ్రరూపం దాల్చాయి. ఆత్రేయపురం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, కపిలేశ్వరపురం, అయినవిల్లి, ముమ్మడివరం, తాళ్లరేవు, రామచంద్రాపురం, కే.గంగావరం, యానాం గౌతవి గోదావరి వరద ముంపులో ఉన్నాయి. క్రమక్రమంగా వరద పెరుగుతోంది. ఉద్యానవన పంటలు , అరటి, బొప్పాయి వంటి పంటలు రోజుల తరబడి నీటిలో నానుతుండతంటో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినవిల్లి మండలంలోని ఎదురుబిడెంలో పడవలపైనే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ముమ్మడివరం మండలంలోని గురజాపులంక, లంక ఆఫ్ ఠానెలంక, తాళ్లరేవు మండలం గోవులలంక, రామచంద్రాపురం మండలం శేరులలంక గౌతమి గోదావరి వరద ఉద్ధృతిలో చిక్కుకున్నాయి. పి. గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నాయి.