Land Occupied by Followers of Kodali Nani was Reoccupied by Owners in Gudivada:కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్‌కు ప్రజలు ఝలక్ ఇచ్చారు. కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66 ఎకరాల స్థలాన్ని యజమానులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్లో 100 కోట్ల విలువైన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నాని అనుచరులు ఆక్రమించుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో స్థల యజమానులకు కాబోయే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము భరోసా ఇచ్చారు. దీంతో స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్, లే అవుట్లో గడ్డం గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను జేసీబీల సాయంతో స్థల యజమానులు ధ్వంసం చేశారు.
160 మందికి చెందిన ఫ్లాట్లను ఆక్రమించుకున్న గడ్డం గ్యాంగ్, ఇదేమి అన్యాయం అని అడిగితే రౌడీలతో దాడి చేశారని వాపోయారు. స్థల యజమానుల్లో పలువురు వైఎస్సార్సీపీ వర్గీయులు ఉన్నారని తమకైన న్యాయం చేయమని అడిగితే 20 ఏళ్ల క్రితం రేటు ఇస్తామంటూ ఎమ్మెల్యే అనుచరుల సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. లే అవుట్లో డౌన్ డౌన్ కొడాలి నాని, జిందాబాద్ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అంటూ స్థల యజమానుల నినాదాలు చేశారు. బిడ్డల భవిష్యత్తు కోసం కొనుక్కున్న భూమిని తన అనుచరులతో కొడాలి నాని కబ్జా చేశాడని బాధితులు తెలిపారు.