Land Grabs Coming Out With Burning of Madanapalle Files:రాష్ట్రంలో సంచలనం రేపిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ దస్త్రాల దహనంతో భూకబ్జాలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాల విషయాలు బయటపడుతున్నాయి. ప్రాథమిక విచారణలోనే దాదాపు 65 శాతం భూములు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీహోల్డ్ చేసినట్లు విచారణలో తేలింది. తదుపరి విచారణలో మరింతగా అక్రమాలు బయటపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో భారీ కుట్ర కోణం దాగి ఉందనే అభిప్రాయంతో పోలీసుశాఖ ఇప్పటికే 9 కేసులు నమోదు చేసింది. తాజాగా సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో వివరాలను సేకరించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
గత నెల 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాలు కాల్చేసిన ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా విచారణ చేపట్టారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఫ్రీహోల్డ్ భూములపై పునఃపరిశీలన చేపట్టాలని ఆదేశించారు. ముందు ఘటనను ప్రభావితం చేసిన మదనపల్లె డివిజన్లో వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ స్వయంగా క్షేత్ర పరిశీలన చేసి సిబ్బంది ద్వారా విచారణ చేపట్టారు.