Land Allotment Policy for Industries: తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన 2015-20 పారిశ్రామిక విధానం ప్రకారం పరిశ్రమలకు అవుట్ రైట్ సేల్స్(ORS) కింద భూములు కేటాయించే నిబంధన ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ విధానంలో మార్పులు చేసింది. తొలుత లీజు విధానంలో భూములను కేటాయించి పదేళ్ల నిర్వహణ తర్వాత రిజిస్ట్రేషన్ చేసేలా "లీజు కం బై" విధానాన్ని తెచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రకటించిన రెండు పాలసీల్లోనూ అదే విధానాన్ని కొనసాగించింది.
లీజు విధానం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఇబ్బందులు వస్తున్నాయని పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక అసోసియేషన్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. 51 నెలలపాటు గుంభనంగా ఉన్న ప్రభుత్వం 2023 అక్టోబరు 30న జరిగిన మంత్రివర్గ భేటీలో మళ్లీ ఓఆర్ఎస్ పద్ధతినే తెస్తూ నిర్ణయం తీసుకొంది. అస్మదీయులకు లబ్ధిచేకూర్చేందుకే ఎన్నికల ముంగిట మార్పులు చేశారనే ఆరోపణలున్నాయి. సీఎం జగన్(CM Jagan) నేతృత్వంలోని పెట్టుబడులు, పారిశ్రామిక ప్రోత్సాహక మండలి పలు సంస్థల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
పెట్టుబడులకు జగన్ దెబ్బ - యువతకు శాపంగా మారిన వైసీపీ సర్కార్
ఐతే "లీజు కం బై" విధానంలో ఆయా సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ సాధ్యపడదు. ఈ ఉద్దేశంతోనే మళ్లీ పాత విధానం అమల్లోకి తెచ్చారనే ఆరోపణలున్నాయి.! జగన్‌కు బంధుత్వం ఉన్న షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8,348 ఎకరాల సేకరణకు ప్రభుత్వం అనుమతులిచ్చింది.! నెల్లూరు జిల్లా తమ్మినపట్నంలో జిందాల్ స్టీల్స్‌కు 860 ఎకరాలు, తాడేపల్లిలోని మెగా రిటైల్ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు 5 ఎకరాలు కేటాయించారు.