Kurnool SP Bindu Madhav on Devaragattu Bunny Festival 2024 :దేవరగట్టు ఆధ్యాత్మిక సంప్రదాయ సంబరాలకు సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా హొళగుంద మండల పరిధిలోని దేవరగట్టులో వెలసిన మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్ర ఈ నెల 12వ తేదీన నిర్వహించనుండగా ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు లక్షాలాదిగా తరలి రానున్నారు.
డ్రోన్ కెమెరాలతో ప్రతీ కదలికపైనా నిఘా :దేవరగట్టులో దసరా సందర్భంగా జరిగే కర్రల సమరంలో హింసను నియంత్రించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకున్నామని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ప్రజలు బన్ని ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అక్రమ మద్యం, నాటు సారా కట్టడికి చర్యలు చేప్టటామని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని స్పష్టం చేశారు. దేవరగట్టుకు వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో ప్రతీ కదలికపైనా నిఘా పెడుతున్నామని చెబుతున్న ఎస్పీ బిందు మాధవ్‌తో ముఖాముఖి.
250కి పైగా సీసీ కెమెరాలు :దేవరగట్టు ఉత్సవంలో భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. అన్ని సౌకర్యాలు సమకూర్చేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దేవరగట్టుకు వెళ్లే మార్గంలో రహదారి మరమ్మతులు, గట్టుపై విద్యుత్తు సమస్య తలెత్తకుండా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. అనుమానితుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు సుమారు 250కి పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
కర్రల సమరానికి సమయమిది - 'దేవర'గట్టు జాతర మొదలైంది!
50 పడకల వైద్యశాల :ఉత్సవంలో భాగంగా జరిగే కర్రల సమరంలో పాల్గొనేందుకు భక్తులు పోటీపడుతుంటారు. ఈ ఘటనలో గాయపడే వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా సుమారు 30 నుంచి 50 మంచాలతో తాత్కాలిక వైద్యశాల ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స సామగ్రి, మందులు, 108 వాహనాలు రెండు నుంచి నాలుగు వాహనాలు ఉండేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. ఈ మేరకు ఆలూరు నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య సిబ్బందితో పాటు జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక సిబ్బంది సేవలు అందించనున్నారు.