KTR Reaction On Union Budget Funds 2024 : బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నానేనని ధ్వజమెత్తారు. పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేటీఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో పాటు అనేకసార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాసామని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణకు కేెంద్ర బడ్జెట్‌లో గుండు సున్నా : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలుగింటి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశించామని దక్కింది శూన్యమన్నారు. 48 లక్షల ఇరవై ఒక్కవేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారని విమర్శలు గుప్పించారు.ఆంధ్రప్రదేశ్, బిహార్‌కి మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్నచూపు చూడడం నిజంగా బాధాకరమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదని తెలిపారు.
స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష : 16 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్, బిహార్‌కు దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలన్నారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల శక్తులను బలోపేతం ఎందుకు చేసుకోవాలో మరోసారి ఈ ఘటన తెలుపుతుందన్నారు. పార్లమెంట్లో కూర్చున్న బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని ఆక్షేపించిన కేటీఆర్ ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్లో గనుక ఉంటే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్లని స్పష్టం చేశారు.
"కేంద్ర బడ్జెట్‌లో కొన్ని రాష్ట్రాలకే పెద్దపీట వేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. రాష్ట్రానికి మరోసారి గుండుసున్నా దక్కింది. గతంలో విభజన చట్టంలోని 35 హామీలపై నిర్ణయం తీసుకోవాలని కోరాం. కేంద్రాన్ని అభ్యర్థిస్తూ గతంలో లేఖలు కూడా రాశాం. ఏపీ, బీహార్‌కు దక్కిన నిధులు చూసైనా ప్రజలు ఆలోచించాలి.స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష." -కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు