BRS MLA KTR On KTR ON Valmiki Scam: కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కిందా మీద పడి సీఎం రేవంత్ రెడ్డి మీడియాను మేనేజ్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. విషయాలను బయటకు రాకుండా ఆపుతున్నారని ఆరోపించారు. ఆ మబ్బులు నాలుగైదు రోజుల్లో వీడిపోతాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ అకౌంట్ల నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు రూ.180 కోట్లు దారి మళ్లించారిని ఆరోపించారు.
కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్ధరామయ్య డబ్బులు దారి మళ్లించామని ఒప్పుకున్నారని తెలియజేశారు. హైదరాబాద్‌లోని తొమ్మిది బ్యాంకు అకౌంట్లకు రూ.45 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్‌కు ఏమైందో కానీ ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. బ్యాంకు అధికారులతో పాటు 11 మందికి ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు చెందిన ఎవరి అకౌంట్లలోకి వచ్చాయని తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ నేతల డొంక కదులుతోందని ఆయన తెలిపారు.
గత ఎన్నికల్లో ఈ డబ్బును కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. ఓ మీడియా సంస్థ ద్వారా బిజినెస్ అనే కంపెనీకి ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని తెలిపారు. తెలుగు మీడియాలో ఈ వార్తలు రాకుండా అడ్డుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో బంగారం షాపులు, బార్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.