KONERU HUMPY ABOUT RETIREMENT:రిటైర్మెంట్పై తనకు ఇప్పుడే ఆలోచన లేదని ప్రముఖ చదరంగం క్రీడాకారిణి కోనేరు హంపి స్పష్టం చేశారు. 2024 సంవత్సరం కష్టతరంగా గడిచిందని, ఆటపరంగా ఒత్తిడి ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఒకానొక దశలో ఆటకు వీడ్కోలు పలకాలని అనుకున్నానని, కానీ న్యూయార్క్‌లో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో తనపై తనకు నమ్మకం ఏర్పడినట్లు చెప్పారు.
భవిష్యత్తులో గ్రాండ్ ఫ్రిక్స్ టోర్నీలతోపాటు మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లు గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు హంపి చెప్పారు. చదరంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహం అందిస్తున్నాయని చెప్పిన హంపి, ప్రస్తుతం క్రీడాకారులు ఆడేందుకు గతంలో కంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. చదరంగంలో సాంకేతికత సైతం కీలకపాత్ర పోషిస్తుందని హంపి తెలిపారు.
టోర్నమెంట్లో విజయం తరువాత మోదీని కలవడం ఎంతో ప్రత్యేకమని అన్నారు. మోదీ ఎంతగానో మెచ్చుకున్నారని తెలిపారు. గతంలో మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు స్కూల్ బ్యాగ్‌ల మీద చెస్ బోర్డు ప్రింట్ చేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారని హంపి పేర్కొన్నారు. దీని ద్వారా పిల్లల్లో చెస్ పట్ల ఆసక్తి పెరుగుతుందని ఆయన చెప్పినట్లు హంపి చెప్పారు. ప్రధానమంత్రి మోదీ చెస్ క్రీడను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు.