Komatireddy Venkat Reddy vs ZP Chairman : ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుబంధు అడిగిన వారిని చెప్పుతో కొట్టాలని అనడం సరైనది కాదు అని బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది దఫాలుగా రైతుబంధు ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతుబంధు పది వేలు కాదు రూ.15,000 ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు గ్రామంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.
ZP Chairman Sandeep Reddy Comments On Congress : పెన్షన్ రెండు వేలు కాకుండా రూ.4000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని బీఆర్ఎస్ జడ్పీఛైర్మన్ సందీప్ రెడ్డి గుర్తుచేశారు. రైతులు తీసుకున్న రుణాలు 9వ తేదీన మాఫీ చేస్తామన్న కాంగ్రెస్(Congress) నాయకులు, తిరిగి రైతులను తిట్టడం భావ్యం కాదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని, సందీప్ రెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ నినాదాలు చేశారు.
అనంతరం సందీప్‌రెడ్డి చేసిన విమర్శలను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండిస్తూ తల్లితండ్రుల పేరుతో జడ్పీ ఛైర్మన్ అయిన వ్యక్తి తన ముందు మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో సభలో కొద్దిసేపటి వరకు గందరగోళం నెలకొంది. దీంతో జడ్పీఛైర్మన్ సందీప్‌రెడ్డిని సభ నుంచి బయటకు పంపాలని పోలీసులకు మంత్రి ఆదేశాలిచ్చారు. వెంటనే పోలీసులు సందీప్ రెడ్డిని సమావేశం నుంచి బయటకు పంపించారు.
Komatireddy Venkat Reddy Fires on KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్(KCR) కాలిగోటికి కూడా సరిపోరని కేటీఆర్ అంటున్నారని, కానీ అదే రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో పడుకోబెట్టారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యంగ్యంగా మాట్లాడారు. అంతకముందు మంత్రి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం గూడూరు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని, మహదేవ్ పురంలో మినీ బస్‌స్టాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోని మహదేవ్‌పురంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు.