KGBV Students Hair Cut Issue : విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలతో పాటు సరైనా విద్యాబుద్ధులను నేర్పుతున్న ఉపాధ్యాయులను చూసే ఉంటాం. పిల్లలను తమ సొంత బిడ్డల వలే భావించి వారి ఉన్నతి కోసం పాటు పడిన వారిని చూసే ఉంటాం. కానీ ఓ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో ప్రత్యేక అధికారిణి తన మాట విద్యార్థులు వినడం లేదని ఆగ్రహానికి గురైంది. దీంతో వారిని క్రమశిక్షణ పేరుతో విద్యార్థినుల జుట్టు కత్తిరించింది. ఈ అమానవీయ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 15న కార్తిక పౌర్ణమి రోజున స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో నీరు అందుబాటులో లేదు. దీంతో బైపీసీ రెండో ఏడాది విద్యార్థులు కొందరు ఉదయం ప్రతిజ్ఞకు ఆలస్యంగా వచ్చారు. 23 మంది విద్యార్థినులు రాలేదని ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో నలుగురిపై చేయి చేసుకున్నారు. విద్యార్థినులను ఎండలో నిల్చోబెట్టగా, ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. మధ్యాహ్న భోజన విరామంలో 18 మంది విద్యార్థినుల జుట్టును కొద్దికొద్దిగా ఆమె కత్తిరించారు.
కొందరు బాత్రూంలోకి పరుగులు పెట్టినా వారిని పట్టుకుని మరి కత్తెరతో కత్తిరించారని విద్యార్థినులు ఆరోపించారు. మరికొందరు అనారోగ్యంతో ఉన్నామని చెప్పినా వినిపించుకోకుండా క్రమశిక్షణా చర్యలు పేరుతో వేధించారని వాపోయారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశామని బాధిత విద్యార్థినులు పేర్కొన్నారు. పాఠశాలకు చేరుకున్న బాలికల తల్లిదండ్రులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పేరుతో ఇలాంటి చర్యలు పాల్పడటం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక అధికారిణి సాయిప్రసన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.