Kanuma Festival Celebrations In Ap : మూడు రోజుల పాటు సందడిగా సాగిన సంక్రాంతి సంబరాలు ముగిశాయి. చివరిరోజైన కనుమ నాడు నిర్వహించిన వివిధ రకాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సొంతూళ్లల్లో కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకున్న విద్యార్థులు, ఉద్యోగులు తిరిగి నగర బాటపట్టారు.
సందడిగా సాగిన సంక్రాంతి పండుగ : రంగవల్లులు, పిండి వంటలు, డూడూ బసవన్నల విన్యాసాలు, హరిదాసుల నృత్యాలు, కోడి పందేలు, పతంగుల కేరింతల మధ్య సంక్రాంతి పండుగ సందడిగా ముగిసింది. గుంటూరులోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో కనుమ రోజు నిర్వహించిన గాలిపటాల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నగర ప్రజలను అలరించాయి. ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు, మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ వేడుకల్లో పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లిలో మహిళలకు పలురకాల పోటీలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు చేరుకున్నవారితో గ్రామంలో సందడి నెలకొంది.
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి పులిపార్వేట ఉత్సవం : వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో కనుమ రోజు మాధవరాయస్వామి పార్వేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో చిట్లా కుప్పలకు నిప్పు అంటించి మంట చుట్టూ పశువులను ప్రదక్షిణగా తిప్పారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట స్వర్ణముఖి నదిలో ఎమ్మెల్యే విజయశ్రీ ఏటి ఉత్సవాల బెలూన్ ఎగురవేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి పులిపార్వేట ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పార్వేట వేడుకలో భాగంగా విడిచిపెట్టిన కుందేళ్లను దక్కించుకునేందుకు పోటీపడ్డారు. పులి పార్వేట ఉత్సవం అనంతరం స్వామి అశ్వ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
వైభవంగా సీతారాముల గ్రామోత్సవం: కర్నూలు మాస్టర్ సర్వీస్ ఆపరేటర్ డీవీఆర్ కేబుల్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు మంత్రి టీజీ భరత్ ఇండోర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జబర్దస్త్ సభ్యులు, ఢీ నృత్యకళాకారులు ప్రేక్షకులను అలరించారు. కర్నూలులో 34వ వార్డు నిర్మల్ నగర్‌లో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. నంద్యాల జిల్లా మహానందిలో కనుమ రోజు సీతారాముల గ్రామోత్సవం వైభవంగా సాగింది.
తెప్పల పోటీలు : సంక్రాంతిని పురస్కరించుకుని నెల్లూరులో తెప్పల పోటీలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పడమటి నాయుడు పల్లెలో గొబ్బెమ్మ పండగ వైభవంగా జరిగింది. డీజే పాటల సందడితో యువత కేరింతలు కొడుతూ గొబ్బెమ్మను కేతమన్నేరు వాగులో నిమజ్జనం చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఒంగోలులో చెన్నకేశవ స్వామి తెప్పోత్సం వైభవంగా జరిగింది. ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల ప్రత్యేక పూజలు చేశారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
మహిళలు వేసిన రంగవల్లులు : విశాఖలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో కనుమ వేడుకలు ఉత్సాహభరిత సాగాయి. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు దంపతులు రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో గజేంద్రమోక్షం వైభవంగా జరిగింది. భక్తుల అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కబడ్డీ ఆడి మహిళలను ఉత్సాహపరిచారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వేణుమాపేటలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి.
కొక్కొరొకో అంటే కోటి! పందేల్లో చేతులు మారిన 2వేల కోట్లు!
కనులపండువగా కనుమ సంబరాలు - గోవులకు ప్రత్యేక పూజలు