Kakinada SP Bindu Madhav Success Story :చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, చదువుకు మధ్యలోనే అంతరాయం, జీవితంలో బోలెడు ఒడుదొడుకులు. ఇవన్నీ సమస్యలను ఎలా అధిగమించాలో నేర్పాయి. పట్టువదలకుండా కృషిచేస్తుంటే కష్టం ఫలించింది. ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. అందరూ శభాష్ అనేలా చేసింది. కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ప్రస్థానమిది.
ఐఆర్‌ఎస్ కావాల్సినవాడిని, ఐపీఎస్ అయ్యా : 'విజయవాడ కెనడీ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. బీటెక్ ఏడాది చదివి మానేశా. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ డిగ్రీ పూర్తిచేశా. ఐసెట్ రాసి జేఎన్‌టీయూహెచ్‌లో ఎంసీఏలో స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎస్‌ఐటీ) చేశాను. 2012లో ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష రాసి, ఆదాయ పన్నుశాఖ ఇన్‌స్పెక్టర్ అయ్యాను. నాలుగేళ్లు ఉద్యోగం చేశాను. పదోన్నతి పొందితే ఐటీ, ఐఆర్‌ఎస్ అధికారి అయ్యేవాడిని. ఐపీఎస్ నా లక్ష్యం. ఉద్యోగం వదిలేసి సివిల్స్‌కు సన్నద్ధమయ్యా 2017 బ్యాచ్‌లో ఐపీఎస్ సాధించా. 2019లో ప్రకాశం జిల్లాలో శిక్షణ ఎస్పీగా, తర్వాత గుంటూరు సెబ్ ఏఎస్పీ, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్, రంపచోడవరం ఏఎస్పీ, గ్రేహౌండ్స్ ఎస్పీ, పల్నాడు, కర్నూలులో ఎస్పీగా పనిచేసి ఇప్పుడు కాకినాడ వచ్చాను.'
తను ఎంతో ప్రోత్సహించింది: పెళ్లయిన తర్వాత అయిదేళ్లు నేను సివిల్స్‌కు సన్నద్ధమవుతూ ఓటమి చెందుతుంటే ఇంకెవరైనా ఇక చాల్లే ఆపేయమంటారు. కానీ నా భార్య ఎప్పటికైనా పాసవుతావని ప్రోత్సహించిందని బిందుమాధవ్ తెలిపారు. మళ్లీ ప్రయత్నించు అంటూ ఇచ్చిన మద్దతు మరువలేనన్నారు. పట్టుదలతో ఐసెట్‌లో అయిదో ర్యాంకు సాధించానని చేప్పారు. ఎస్‌ఎస్‌సీలో 196వ ర్యాంకు సాధించానన్నారు. ఐపీఎస్ కోసం సివిల్స్ రాస్తే అయిదుసార్లు విఫలమయ్యారని, ఆరో ప్రయత్నంలో 172 ర్యాంకు సాధించానని హర్షం వ్యక్తం చేశారు.