Kakatiya Thermal Power Plant Create New record : జయశంకర్ భూపాలపల్లి, గణపురంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు ( కేటీపీపీ ) 202 రోజులు నిరంతరాయంగా విద్యుత్తు ఉత్పత్తిని సాధించి కీలక మైలురాయిని అధిగమించింది. ఇందులో మొదటి యూనిట్ 500, రెండో యూనిట్ 600 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ఈ విద్యుత్తు కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంటు 2023 డిసెంబరు 15 నుంచి ఈ నెల 4 వరకు నిరంతరాయంగా 202 రోజులు నడిచి 85.36 శాతం పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధించింది.
దీంతో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటు ప్రభుత్వరంగ విద్యుత్తు కేంద్రాల్లో 600 మెగావాట్ల విభాగంలో దేశంలోనే ఎక్కువ రోజుల పాటుగా నడిచిన యూనిట్‌గా నిలిచింది. 202 రోజుల్లో ఈ యూనిట్‌లో సుమారు 2,460.2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందని విద్యుత్ ప్లాంట్ అధికారులు తెలిపారు. గతంలో మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఎస్టీపీపీలోని 600 మెగావాట్ల యూనిట్ 194 రోజులు నిరంతరాయంగా నడిచిందని పేర్కొన్నారు. ఆ రికార్డును కేటీపీపీ తిరగరాస్తూ 202 రోజుల పాటుగా నిరంతరాయంగా పని చేసిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది.