PC Ghosh Enquiry On Kaleshwaram Today : కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తదుపరి ప్రక్రియ నేటి నుంచి కొనసాగనుంది. కోల్‌కతా నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఇప్పటికే ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, విశ్రాంత ఇంజనీర్లు, ఇతరులను విచారణ చేసిన కమిషన్, వారి నుంచి అఫిడవిట్లు తీసుకుంది.
ఆ ఆఫిడవిట్లు అన్నింటినీ కమిషన్ పూర్తిస్థాయిలో విశ్లేషిస్తోంది. అందులోని అంశాల ఆధారంగా తదుపరి ప్రక్రియను కొనసాగించనున్నారు. అఫిడవిట్లలో ఉన్న అంశాలపై బహిరంగ విచారణకు కూడా జస్టిస్ పీసీ ఘోష్ సిద్ధమవుతున్నారు. సాక్ష్యాల నమోదు, క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేపట్టనున్నారు. సాంకేతిక అంశాలపై కమిషన్ కసరత్తు దాదాపుగా పూర్తి కాగా, ఆర్థిక అంశాలపై కూడా దృష్టి సారించింది. అందుకు సంబంధించిన విషయాలపై కమిషన్ ఆరా తీస్తోంది.
Kaleswaram Project Further investigation : ఈ దఫా మరికొందరు కూడా కమిషన్ ముందు హాజరుకానున్నారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రాణహిత - చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజినీరింగ్ చేయడం, సంబంధిత అంశాలను ఆయన కమిషన్‌కు వివరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత మరికొందరు, అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా కమిషన్ ఎంక్వైరీ కోసం పిలిచే అవకాశం ఉంది.