Kaleshwaram Project Judicial Inquiry Updates : కాళేశ్వరం ఎత్తిపోతల ఆనకట్టలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) నేతృత్వంలో న్యాయ విచారణ కొనసాగుతోంది. ఓవైపు కమిషన్ బ్యారేజీలను పరిశీలిస్తూనే, మరోవైపు ఇందుకు కారణమైన బాధ్యులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా నేడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ)లు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌సింగ్‌లను విచారించనుంది. ఆనకట్టలకు సంబంధించిన పలు అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ వారిని ప్రశ్నించనున్నారు. హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
Kaleshwaram Barrages Issue Updates :తెలంగాణ సర్కార్ సూచించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లోని ప్లానింగ్, డిజైన్స్, కన్‌స్ట్రక్షన్‌లతోపాటు అనేక ఇతర అంశాలపై ముగ్గురు ఈఈలు తిరుపతిరావు, యాదగిరి, ఓంకార్‌సింగ్‌లను విచారించనున్నారు. టెయిల్ వాటర్, షూటింగ్ వెలాసిటీ(ఆనకట్ట నుంచి దిగువకు నీటి విడుదల సమయంలో పడే దూరం) అంశాలపై ప్రశ్నించనుంది. బ్యారేజీల నుంచి సెకనుకు 4.8 నుంచి 5 మీటర్ల వరకు షూటింగ్ వెలాసిటీ ఉండాల్సి ఉంది. దీనికి భిన్నంగా 16 నుంచి 18 మీటర్ల వరకు వస్తోంది. ఈ తేడాలతో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, నిర్మాణాలు దెబ్బతినడం వంటివి సంభవిస్తున్నాయి. ఆనకట్టలో ఇసుక పేరుకుపోవడం, నిర్మాణ సంస్థలు, నీటిపారుదలశాఖతో ఈఈలు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలపైనా కమిషన్ దృష్టిసారించనున్నట్లు తెలిసింది.