తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో భర్త మరణం - 14 ఏళ్లకు దక్కిన న్యాయం - JUSTICE FOR ROAD ACCIDENT CASE

14 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భర్త - 2024లో లోక్‌ అదాలత్‌తో దక్కిన న్యాయం - రూ.1.99 కోట్ల చెక్కు పరిహారం అందజేత

Justice for Road Accident Case
Justice for Road Accident Case (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

Justice for Road Accident Case : రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి భార్య, కుమార్తెలకు 14 ఏళ్ల తర్వాత న్యాయం జరిగింది. వారికి ఏకంగా 1.99 కోట్ల పరిహారం దక్కింది. శనివారం హైకోర్టు లీగల్​ సర్వీసెస్​ కమిటీ నిర్వహించిన జాతీయ లోక్​ అదాలత్​లో వారి కేసు పరిష్కారం అయింది. దీంతో వారికి రూ.1.99 కోట్ల చెక్కును అందజేశారు.

2010లో రోడ్డు ప్రమాదంలో భర్త నంద కిశోర్​ రెడ్డి మృతి చెందగా, రూ.2 కోట్ల పరిహారం కోసం ఆయన భార్య పి.శ్వేత, కుమార్తె సుదీక్షణ్​ నందినీ రెడ్డి మోటారు వాహనాల ప్రమాద కేసుల ట్రైబ్యునల్​లో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ కాలం ట్రైబ్యునల్​ విచారించి, ఈ ఏడాది జూన్​లో రూ.1.08 కోట్ల పరిహారం మాత్రమే చెల్లించాలని లారీ యజమాని, బజాజ్​ ఇన్సూరెన్స్​ తదితరులకు ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో హైకోర్టు లీగల్​ సర్వీసెస్​ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్​ అదాలత్​లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ సూరేపల్లి నంద, మాజీ న్యాయమూర్తి జస్టిస్​ జి.శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వారి కేసును పరిష్కరించింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య రాజీ కుదిర్చి బాధితులకు రూ.1.99 కోట్ల చెక్కును పరిహారంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు.

కమిటీ ఛైర్మన్​ జస్టిస్​ అభినంద్​ కుమార్​ షావిలి సూచనల మేరకు ఈ లోక్ ​అదాలత్​ను నిర్వహించి 225 కేసులను పరిష్కరించారు. ఇందులో మోటారు వాహనాల చట్టం కింద 169 కేసులకు పరిష్కారం దొరికింది. అలాగే కార్మికుల పరిహారం, సిటీ సివిల్‌ కోర్టు అప్పీళ్లు, కుటుంబ వివాదాలను పరిష్కరించారు. ఏకంగా రూ.15.93 కోట్ల పరిహారాన్ని 1,100 మంది లబ్ధిదారులకు ప్రకటించినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 11.56 లక్షల కేసులు పరిష్కారం : రాష్ట్రవ్యాప్తంగా శనివారం జరిగిన జాతీయ లోక్​ అదాలత్​లో 11.56 లక్షల కేసులు పరిష్కారం అయినట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సభ్య కార్యదర్శి సీహెచ్​.పంచాక్షరి తెలిపారు. ఇందులో వివిధ కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న 2,702 సివిల్​ కేసులు, 6.11 లక్షల క్రిమినల్​ కేసులు పరిష్కారం కాగా, బాధితులకు పరిహారంగా రూ.161.05 కోట్లు అందజేసినట్లు వివరించారు. 5.42 లక్షల ప్రీలిటిగేషన్‌ కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details