Justice PC Ghose Judicial Inquiry on Kaleshwaram : కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణాల వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ న్యాయ విచారణ ముమ్మరంగా కొసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలన్న ఆదేశాల మేరకు బ్యారేజీల పనులు చేసినట్లు నిర్మాణసంస్థల ప్రతినిధులు చెప్పినట్లు కాళేశ్వరం విచారణ కమిషన్ ఛైర్పర్సన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు.
నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇవాళ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్ సంస్థలకు చెందిన ప్రతినిధులు విచారణకు హాజరైన వారిలో ఉన్నారు. ఆనకట్టల డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ సంబంధిత అంశాల గురించి కమిషన్ విచారణలో ఆరా తీసింది. సంబంధిత వివరాలు తీసుకున్నారు.
తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేసిన వారిపై చర్యలు :నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. అఫిడవిట్ల దాఖలుకు నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. కమిషన్కు ఎవరు, ఏది చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని, సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు అడుగుతున్నట్లు వివరించారు.