Jogi Ramesh Bail Petition Hearing: చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై మూకుమ్మడి దాడి కేసుకు సంబంధించి విచారణ సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను అడిగిన ప్రశ్నలకు పక్కనే కూర్చున్న సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సమాధానం ఇస్తున్నారని పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్థార్థ లూథ్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. అందుకు సంబంధించిన వీడియోను కోర్టు ముందు ఉంచామని దానిని పరిశీలించాలని కోరారు. దర్యాప్తునకు సహకరించడం లేదనేందుకు ఈ వీడియోనే నిదర్శనం అన్నారు.
తెలీదు, గుర్తులేదు: విచారణకు రావాలని మూడు నోటీసులిస్తే ఒక్కదానికి స్పందించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం అరెస్టు నుంచి రక్షణ పొంది, కోర్టు ఉత్తర్వులను ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. చట్టం కంటే తామే ఎక్కువని భావిస్తున్నారన్నారు. దాడి ఘటన సమయంలో వినియోగించిన సెల్ ఫోన్, సిమ్ నంబరు, ఐఎంఈఐ నంబరు, ఫోన్ బిల్లులు, తదితర వివరాలను కోరితే జోగి రమేష్ ఎక్కువ ప్రశ్నలకు సమాధానంగా ‘తెలీదు, గుర్తులేదు’ అంటూ దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారన్నారు. ఫోన్లను పోలీసులకు అప్పగించేందుకు నిరాకరించారన్నారు.
దర్యాప్తును నీరుగార్చారు: హైకోర్టులో జోగి రమేష్ బెయిలు పిటిషన్లో వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది పొన్నవోలు జోగి రమేష్‌తో పోలీసు విచారణకు హాజరై అవరోధం కల్పిస్తున్నారన్నారు. నిందితుడి పక్కనే న్యాయవాది ఉండి విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి వెనుక కుట్ర కోణాన్ని తేల్చాల్సి ఉందన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, దాడి ఘటన విషయంలో అప్పట్లో స్వల్ప సెక్షన్లు నమోదు చేయించారని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు, బాధితులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారన్నారు. దర్యాప్తును నీరుగార్చారన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలతో కూడిన కేసు డైరీని కోర్టు ముందు ఉంచామని వాటిని పరిశీలించాలని కోరారు.