JD Lakshminarayana Comments on YCP Government:ముఖ్యమంత్రి జగన్ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి బటన్ నొక్కటానికే పరిమితం అయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విమర్శించారు. విధాన పరమైన నిర్ణయాలన్నీ జగన్ ఒక్కరే తీసుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో సలహాలు తీసుకోవట్లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో కేవలం 50 నుంచి 60 శాతం మాత్రమే ఓటింగు నమోదవుతుందన్నారు. 40 శాతం మంది ప్రజలు ఓటు వేయకపోవడంతో ఓటు బ్యాంకు రాజకీయాలు అనేవి పెరిగిపోతున్నాయని జేడీ అన్నారు. గ్రామ వాలంటీర్లు ఈ ఓటు హక్కుపై ప్రభావితం చూపిస్తున్నారని, చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లను వాళ్ల జిల్లాల నుంచి పక్క జిల్లాలకు బదిలీ చేయాలని ఎన్నికల కమీషన్ను కోరినట్లు తెలిపారు. ఎన్నికలనేవి పారదర్శకంగా జరగాలి. అందుకే ప్రభుత్వం, ఈసీ ఈ విషయాలను పట్టించుకుని తగిన మార్పులు చేస్తారని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
అందరూ ఉద్యమిస్తే ప్రత్యేక హోదా కచ్చితంగా సాధిస్తాం: జేడీ
రాష్ట్రంలో సామ్యవాదం పోయి పెట్టుబడి దారీ విధానం వచ్చిందన్నారు. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తుందని జేడీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు గొంతులను నొక్కేసి స్వేచ్ఛగా ఆలోచించే సమయం ఇవ్వడం లేదన్నారు. యువతరం రాజకీయాలకు దూరంగా ఉండటంతో కొంతమంది కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టే వారికే సీట్లను కేటాయిస్తూ యువ నాయకత్వం లేకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ఓటర్లంతా సమయస్ఫూర్తితో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును చక్కగా వినియోగించుకోవాలని జేడీ సూచించారు.