Jani Master Rape Case Updates : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మొదటిసారి లైంగికదాడి జరిగినప్పుడు తాను మైనర్‌ను అని చెప్పడంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మతం మారాలని, పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఇబ్బందులకు గురిచేయడం, ఈ విషయం బయట చెబితే సినీ అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
సుదీర్ఘంగా విచారించిన పోలీసులు :పోలీసులు నిన్న రాత్రి గోవాలో జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ట్రాన్సిట్ పిటిషన్‌తో హైదరాబాద్ తీసుకువచ్చిన పోలీసులు దాదాపు 8 నుంచి 10 గంటల పాటు విచారించారు. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ చేసిన తప్పును అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఢీ షో సీజన్ 12 సందర్భంగా 2019 లో జానీ మాస్టర్‌తో బాధితురాలికి తొలిసారి పరిచయమైనట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఆ తర్వాత దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్‌గా చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముంబైలోని ఓ హోటల్‌లో బాధితురాలిపై 2020లో జానీమాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లుగా నిర్ధారించారు. గత నాలుగేళ్లలో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, జానీ మాస్టర్ భార్య సైతం బాధితురాలిని బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.