‘నవరత్నాల’తో మురిపిస్తామంటూ మాయమాటలు - పింఛన్ తొలగించి పేదలకు వంచన Jagan Conditions on Pensions : జగన్ పేదలకు అందజేసిన పింఛన్ల తీరు కొండంత రాగం తీసి గోరంత పాట పాడిన చందంలా మారింది. కనికట్టు చేసి, లేనిపోని నిబంధనలు పెట్టి పెంచినట్టు గారడీ చేసి నిరుపేదలు, అట్టడుగు వర్గాల వారి పింఛన్లకు అడ్డగోలుగా కోత కోశారు దయలేని జగన్. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారినీ వదల లేదు. ఒకటి కాదు, రెండు కాదు ఇలా లక్షలాది పింఛన్లకు కత్తెర వేసి వారి నోటి దగ్గరి ముద్దను కాలదన్నారు. ఎంత మందికి కోత కోశారు అన్న వివరాలను ఇవ్వడానికి కూడా వైఎస్సార్సీపీ సర్కారుకు ధైర్యం రావడం లేదు. గతేడాది అక్టోబరు వరకు ఎన్ని పింఛన్లు తొలగించారని స.హ.చట్టం ద్వారా అడిగినా వివరాలు ఇవ్వకుండా అధికారులు దాటవేశారు. గతేడాది ఆగస్టు - డిసెంబరు వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు అందరికీ అర్హత ఉంది. అయినా గత జనవరి నెలలో దాదాపు లక్ష దరఖాస్తులను తొక్కిపెట్టి వారికి పింఛను రాకుండా కుట్ర పన్నారు.
అభాగ్యులపై విషం : బిడ్డల ఆదరణకు నోచుకోని తల్లిదండ్రులకు, అనారోగ్యంతో కుదేలవుతున్న రోగులకు, ఆదరువు లేని వృత్తిదారులకు గత ప్రభుత్వాలు పింఛన్లు మంజూరు చేసి అండగా నిలిచింది. ఇలాంటి అభాగ్యులను ఆదుకోవాల్సిన జగన్ వారిపై విషం చిమ్మారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, 300 యూనిట్ల విద్యుత్తు వాడుతున్నా, పట్టణాల్లో 750 చ.అ.విస్తీర్ణంలో స్థలం ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా వారిని అనర్హులుగా నిర్ణయించారు. కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్డలు ఎంత మంది లేరు? నివాస స్థలాలు, దండిగా వ్యవసాయం కలిగి ఉన్నా తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని పిల్లలు ఎందరు ఉండరు? ఇలాంటి వారికి సామాజిక భద్రత పింఛన్లను దూరం చేశారు జగన్. మరోవైపు 50 వేల మంది హెచ్‌ఐవీ రోగులకు రెండేళ్లుగా పింఛను ఇవ్వడం లేదు.
పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సీఎస్‌పై విచారణ జరపాలి- NHRCకి కూటమి నేతల ఫిర్యాదు - NDA Complaint to NHRC on AP CS
పారదర్శకతకు పాతర :పథకాల్లో పారదర్శకత కోసమే సామాజిక తనిఖీ తెచ్చామని ఊదరగొట్టే జగన్ చేతల్లోకి వచ్చేసరికి దానికి పాతరేశారు. ఎంత మంది పింఛన్లను ఏ కారణాలు చూపి తెగ్గోశారన్న వివరాలు బయటపడతాయన్న ఉద్దేశంతో సామాజిక తనిఖీని రెండేళ్లుగా పక్కన పెట్టారు. అర్హులు, అనర్హుల జాబితాను కూడా సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు. గత జనవరిలో కొత్తగా పింఛన్ల కోసం 2.14 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 1.17 లక్షల మందికి మాత్రమే మంజూరు చేశారు. అర్హత ఉన్న 97 వేల మందికి కారణాలు చెప్పకుండానే నిలిపేశారు.
వ్యూహాత్మకంగా కోతలు :మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి కూడా పింఛన్లలో తగ్గించేశారు. జగన్ అధికారంలోకి వచ్చే సమయానికి పరిశీలిస్తే 2019 మే నెలలో 7,500, జూన్‌లో 8,300, జులైలో 9 వేల పింఛన్‌దారుల మరణాలు నమోదయ్యాయి. 2019 డిసెంబర్ వరకు కూడా 20 వేల సంఖ్యను ఎప్పుడూ దాటలేదు. తర్వాత జగన్ తొలగింపు కత్తెర మొదలుపెట్టారు. 2021 మేలో 50 వేలు, జూన్‌లో 45 వేల తగ్గుదల ఉంటే జులైలో ఏకంగా 1.30 లక్షల తగ్గుదల కనిపించింది. 2022 డిసెంబరులో 57 వేలు, 2023 అక్టోబరులో 24 వేల తగ్గుదల నమోదైంది.
కుటుంబానికి ఒకటే పింఛన్ :ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాల వారు పింఛన్లు తీసుకోవడం జగన్‌కు నచ్చలేదు. టీడీపీ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఇద్దరు పింఛనుదారులు ఉన్నా భారంగా భావించలేదు. జగన్ మాత్రం ఒక బియ్యం కార్డుపై రెండు పింఛన్లు ఉండకూడదనే ఉత్తర్వును తెరమీదకు తెచ్చి విచ్చలవిడిగా కోత కోశారు.
ఒంటరి మహిళల వేదన :పట్టణాల్లో 35 ఏళ్లు, గ్రామాల్లో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు గత టీడీపీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వారి పింఛను అర్హత వయసును పెంచేశారు. 50 ఏళ్లు పైబడిన ఒంటరి మహిళలకు మాత్రమే పింఛను ఇస్తామని కొర్రీలు పెట్టారు.
ఆ మూడు వర్గాలకు మొండిచేయి :దివ్యాంగులు, డప్పు కళాకారులు, హిజ్రాల ఆదరువును జగన్ పట్టించుకోలేదు. గత టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల వ్యవధిలో దివ్యాంగుల పింఛనును వైకల్య శాతం ఆధారంగా రూ.500 నుంచి రూ.3 వేలకు పెంచింది. డప్పు కళాకారులు, హిజ్రాలకు నెలకు రూ.3 వేల చొప్పున అందజేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ తన అయిదేళ్ల పాలనాకాలంలో వీరికి పైసా కూడా పెంచలేదు. ప్రస్తుతం 8.07 లక్షల మంది దివ్యాంగులు, 63 వేల మంది డప్పు కళాకారులు, 2,272 మంది హిజ్రాలు పింఛను పొందుతున్నారు.
కులవృత్తిదారులపై దొంగదెబ్బ : గత ప్రభుత్వం చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులకు పింఛను ఇస్తుండేది. వెనకబడిన వర్గాల వారికి పింఛను ఇవ్వడం ఇష్టం లేని జగన్ జనవరిలో కొత్తగా ఆయా వర్గాల వారు సమర్పించిన దరఖాస్తులను పక్కన పెట్టి వారిపై దొంగదెబ్బ తీశారు. చేనేత కార్మికుల పింఛనుపైనా దుర్మార్గంగా వ్యవహరించారు. సంఘాల్లో ఉన్న వారు నెలకు 15 రోజుల చొప్పున ఏడాది పాటు చేనేత వృత్తిలో ఉన్నట్టు, మాస్టర్ వీవర్ల వద్ద కూలి పనిచేస్తే ఆ మాస్టర్ చెల్లించిన డబ్బులు రెండేళ్లపాటు కార్మికుడి బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్ ద్వారా బదిలీ అయినట్టు ఆధారాలు చూపించాలని కొర్రీ పెట్టారు. ఈ నిబంధనల వల్ల ఒక్క చేనేత కార్మికుడికి కూడా పింఛను రాదు అని జిల్లా కలెక్టర్లు చెప్పినా జగన్ చెవికి ఎక్కించుకోలేదు. ఇతర కులవృత్తిదారుల విషయంలోనూ ఇలాంటి నిబంధనలే! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 93 వేల మంది చేనేత కార్మికులు, 68 వేల మంది మత్స్యకారులు, 47 వేల మంది చర్మకారులు, 41 వేల మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు తీసుకుంటున్నారు.
వైసీపీ శవరాజకీయాలు చేస్తోంది - పింఛన్ ఇవ్వకుండా చేసే కుట్రను అడ్డుకుంటాం: టీడీపీ - pensions Distribution issue in ap
ఏ నెల పింఛను ఆ నెలనే తీసుకోవాలి :గత టీడీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు ఏ కారణంగానైనా ఒక నెల గానీ, రెండో నెల గానీ పింఛను తీసుకోకపోతే తర్వాతి నెలలో కలిపి ఇచ్చేవారు. కానీ జగన్ ఏ నెల పింఛను ఆ నెల మాత్రమే తీసుకోవాలనే నిబంధన పెట్టారు. ఒక నెల పింఛను తీసుకోకపోతే మరుసటి నెలలో పాత పింఛను ఇవ్వరు. ఇతర ప్రాంతాలకు కూలీ, అత్యవసర పనులు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నిబంధనల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ఆ వెసులుబాటును తీసేసింది. ప్రతి నెలా 4 వేల నుంచి 5 వేల వరకు పింఛన్లను తొలగిస్తూ లబ్ధిదారుల పొట్టకొడుతున్నారు. ఇలా మూడు నెలలు వరసగా పింఛను సొమ్ము తీసుకోలేదన్న సాకుతో దాదాపుగా 2.80 లక్షల మంది పింఛన్లను తెగ్గోశారు.
అబద్ధాలే అబద్ధాలు :గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 53.85 లక్షల మందికి పింఛన్లు అందేవి. ఇందుకు ప్రతినెలా రూ.1,305 కోట్లు ఖర్చు అవుతుండేది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ సర్కారు అధికారికంగా చెప్పిన లెక్కనే ఇది. కానీ, సీఎం జగన్ దాన్ని దాచిపెట్టి, టీడీపీ ప్రభుత్వం 30 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేదని అబద్ధాలు వల్లెవేశారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత 4 లక్షల మంది పింఛన్లు తొలగించారు. టీడీపీ ప్రభుత్వం 2014లో పింఛనుదారులకు అందే రూ. 200 మొత్తాన్ని 2019 నాటికి రూ.2 వేలకు పెంచింది. అంటే ఐదేళ్లలో 10 రెట్లు పెరిగింది. అధికారంలోకి వస్తే రూ.2 వేల పింఛనును రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతానన్న జగన్.. రూ.వెయ్యి పెంచేందుకు అయిదేళ్ల సమయం తీసుకున్నారు.
పింఛనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలే - జగన్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి: చంద్రబాబు - CHANDRABABU ON PENSIONS