ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండేళ్లుగా చట్టం చుట్టం చేతుల్లోనే - సీనియారిటీతో జగనన్నకు పనిలేదు!

Jagan Govt Aappointed Rajendranath Reddy as DGP: తమ వాడైతే చాలు సీనియారిటీతో మాకేం పని అన్నట్లు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 11 మంది సీనియర్లను తొక్కేసి డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి నియామించిన జగన్‌ సర్కార్‌ రెండేళ్లుగా ఇన్‌ఛార్జిగా ఆయనే కొనసాగిస్తోంది. ఇష్టారాజ్యంగా చట్టాలను మార్చేస్తూ అక్రమార్కులపై తిరగబడాల్సిన పోలీస్‌ వ్యవస్థను విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడానికి వాడుకుంటోంది.

jagan_govt
jagan_govt

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 7:32 AM IST

రెండేళ్లుగా చట్టం చుట్టం చేతుల్లోనే - సీనియారిటీతో జగనన్నకు పనిలేదు!

Jagan Govt Aappointed Rajendranath Reddy as DGP:రాష్ట్రంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌కు బదులు జగన్‌ పీనల్‌ కోడ్‌ ఘనంగా అమలవుతోంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ స్థానంలో వైఎస్‌ఆర్‌ క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ కొనసాగుతోంది. వీటికి తోడు తమ వాడు అయి ఉండి కనీస అర్హతలుంటే చాలు సీనియారిటీ జాబితాలో అట్టడుగున ఉన్నా సరే వారందరినీ అడ్డగోలుగా కిందకు తొక్కేసి మరీ డీజీపీగా కొనసాగిస్తారు. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కనపెట్టేసి మరీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జీ డీజీపీగా నియమించిన జగన్‌ ప్రభుత్వం రెండేళ్లుగా ఆయన్ను అదే హోదాలో కొనసాగిస్తోంది.

పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అర్హులైన అధికారుల వివరాలతో జాబితా పంపాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పదే పదే లేఖలు రాస్తున్నా ఖాతరు చేయడం లేదు. డీజీపీ నియామకం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోవడమే లేదు. ఈ నేపథ్యంలో తాత్కాలిక డీజీపీ వద్దు పూర్తిస్థాయి డీజీపీని వెంటనే నియమించండంటూ కేంద్రం తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వానికి లేఖ పంపింది.

గొప్పలు అదుర్స్‌, రాబడి రివర్స్‌ - జగన్ పాలనలో మరింత వెెనక్కి

కేంద్రం లేఖ రాసినా పట్టనట్టే: వడ్డించే వాడు మనవాడైతే అన్నట్లుగా పోస్టింగ్‌ ఇచ్చేది తమవాడు కావటంతో సీనియారిటీలో అట్టడుగున ఉన్నప్పటికీ రాజేంద్రనాథరెడ్డిని ఇన్‌ఛార్జి డీజీపీగా నియమించుకున్నారు. 1992 బ్యాచ్‌ అధికారైన ఆయనను అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతి పొందిన కొద్ది రోజుల్లోనే పోలీసు దళాల అధిపతిగా నియమిస్తూ 2020 ఫిబ్రవరి 15న జగన్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

డీజీపీ ర్యాంకులో అప్పటికి 1986 బ్యాచ్‌కు చెందిన వీఎస్​కే కౌముది, 1987 బ్యాచ్‌ ఎన్‌.వి.సురేంద్రబాబు, ఏ.ఆర్‌.అనూరాధ, ఏబీ వెంకటేశ్వరరావు, కేఆర్‌ఎం కిషోర్‌కుమార్ 1989 బ్యాచ్‌ ద్వారకా తిరుమలరావు, 1990 బ్యాచ్‌ అంజనా సిన్హా , మాదిరెడ్డి ప్రతాప్, 1991 బ్యాచ్‌ మహ్మద్‌ హసన్‌ రెజా, హరీష్‌కుమార్‌ గుప్తా, 1992 బ్యాచ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఉన్నారు. సీనియారిటీ జాబితాలో వీరంతా రాజేంద్రనాథరెడ్డి కంటే ముందు వరుసలో ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం వారందర్నీ కిందకు తొక్కిపెట్టి తమ వాడికి డీజీపీగా పట్టం కట్టి పైకి తీసుకొచ్చింది.

12వ స్థానంలో రాజేంద్రనాథరెడ్డి పేరు:డీజీపీగా ఉన్న గౌతమ్‌సవాంగ్‌ను ఆకస్మికంగా, అర్ధంతరంగా ఆ పోస్టు నుంచి పక్కకు తప్పించి ఆ స్థానంలో ఇన్‌ఛార్జి డీజీపీగా కేవీ రాజేంద్రనాథరెడ్డిని నియమించిన జగన్‌ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది. అర్హులైన అధికారులు తగినంత మంది అందుబాటులో ఉన్నప్పటికీ వారెవరికీ ఈ బాధ్యతలివ్వలేదు. ఆ తర్వాతనూ పూర్తిస్థాయి డీజీపీ నియామకానికి అవసరమైన ప్రక్రియ చేపట్టలేదు. ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర క్యాడర్‌లో డీజీపీ హోదాలో ఉన్న అధికారుల్లో సీనియారిటీ ప్రకారం ఐదుగురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించాలి. వారి సర్వీసు రికార్డు, నిజాయతి, నిబద్ధత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారిలో ముగ్గురి పేర్లను యూపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. అందులో ఒకర్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేయాలి.

సీబీఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా సాగుతున్న జగన్‌ - 381వ సారి వాయిదా

దురుద్దేశంతోనే ఈ తాత్సారం:ఇన్‌ఛార్జి డీజీపీని నియమించి రెండేళ్లవుతున్నా పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం జగన్‌ ప్రభుత్వం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి జాబితా పంపలేదు. దురుద్దేశంతోనే ఈ తాత్సారం చేస్తున్నారని సీనియర్‌ ఐపీఎస్‌లు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఒకవేళ యూపీఎస్సీకి జాబితా పంపిస్తే సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథరెడ్డి పేరు అందులో పొందుపరచడం సాధ్యం కాదు. దీంతో తమకు కావాల్సిన వ్యక్తి రెగ్యులర్‌ డీజీపీ అయ్యేందుకు అవకాశం ఉండదు. వేరేవారిని నియమించాల్సి వస్తుంది. వారు తమ అక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తారో లేదో తెలీదు. అందుకే సీనియారిటీ జాబితాలో రాజేంద్రనాథరెడ్డి పేరు ముందు వరుసలోకి వచ్చేంతవరకూ జాబితా పంపకుండా నిలిపేశారు.

రాజేంద్రనాథరెడ్డి ఇన్‌ఛార్జి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత రెండేళ్ల వ్యవధిలో డీజీ ర్యాంకు అధికారులైన వీఎస్‌కే కౌముది, ఎన్‌.వి.సురేంద్రబాబు, ఏ.ఆర్‌.అనూరాధ, కేఆర్‌ఎం కిషోర్‌కుమార్, మహ్మద్‌ హసన్‌ రెజాలు పదవీ విరమణ చేశారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం అప్పట్లోనే జగన్‌ ప్రభుత్వం కేంద్రానికి జాబితా పంపించి ఉంటే వీరందరి పేర్లు అందులో పొందుపరచాల్సి వచ్చేది. కానీ దురుద్దేశంతో తాత్సారం చేయటం వల్ల వీరికి పోలీసు దళాల అధిపతిగా పనిచేసే అవకాశం దక్కనీయకుండా చేసింది.

సీనియర్‌ అధికారులు ఒక్కొక్కరూ పదవీ విరమణ చేయటంతో 2024 జనవరి 18 నాటికి రాజేంద్రనాథరెడ్డి సీనియారిటీ జాబితాలో ఏడో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం ఆయన కంటే ముందు వరుసలో ఏబీ వెంకటేశ్వరరావు, సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్‌కుమార్‌ గుప్తా, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఉన్నారు. కానీ వారందర్నీ పక్కనపెట్టి మరీ రాజేంద్రనాథరెడ్డినే ఇంకా ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తున్నారు. 1993, 1994 బ్యాచ్‌లకు చెందిన ఐపీఎస్‌ అధికారులకు జనవరి నెలలో అదనపు డీజీపీ నుంచి డీజీపీగా పదోన్నతులు రావాలి. కానీ భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వాటికి కూడా మోకాలడ్డారు.

తండ్రి హయాంలో నిబంధనలకు 'సున్నం' - జగన్​కు నిధుల భోజనం

వైసీపీ నాయకులకు బౌన్సర్లుగా:ఇన్‌ఛార్జి డీజీపీగా వ్యవహరిస్తున్న రాజేంద్రనాథరెడ్డి తొలి నుంచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై ఎన్ని దాష్టీకాలు జరుగుతున్నా ఆయన ఏ రోజూ వాటి గురించి పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో కొంతమంది ఎస్పీలు మొదలుకుని ఎస్సైల వరకూ అనేకమంది వైసీపీ నాయకులకు అనధికారిక బౌన్సర్లలా వ్యవహరిస్తూ పేట్రేగిపోతున్నా వారిపై ఏ చర్యలూ తీసుకోలేదు. ఈయన హయాంలో ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించేవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు.

వైసీపీకి మద్దతుగా ప్రతిపక్షాలకు చెందిన వారిపై ఫిర్యాదులివ్వడానికి వచ్చేవారికి పోలీసు ప్రధాన కార్యాలయంలోకి సాదరంగా ఆహ్వానించి మరీ స్వీకరిస్తారు. అదే వైసీపీ నాయకుల దాష్టీకాలు, పోలీసుల ఏకపక్ష తీరు, అణచివేత, ప్రభుత్వ ప్రాయోజిత హింస బారిన పడ్డ బాధితుల సమస్యలపై ఫిర్యాదులివ్వడానికి వెళ్లే ప్రతిపక్ష నాయకుల్ని మాత్రం ఆయన కలవనే కలవరు. కనీసం పోలీసు ప్రధాన కార్యాలయం గేటు దాటి లోపలికి అనుమతించరు.

ప్రజాస్వామ్యయుతంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే వివాదాస్పద ప్రాంతాల్లోకి మిమ్మల్ని ఎవరు వెళ్లమన్నారంటూ ప్రతిపక్షాల్ని ప్రశ్నిస్తారు. రాజేంద్రనాథ్‌రెడ్డి హైకోర్టు అనుమతితో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే వారి మార్గంలోకి చొరబడి మరీ అరాచకం సృష్టించిన అధికార పార్టీ నాయకులకు మాత్రం నిరసన తెలుపుకోవచ్చంటూ అనుమతిచ్చారు. ఇలా రాష్ట్రంలో వైసీపీ అనుబంధ సాయుధ విభాగంలా మారిపోయి అరాచకం సృష్టిస్తున్న పోలీసు వ్యవస్థకు ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. దీనికోసమే ఆయన్ను ఇన్‌ఛార్జి డీజీపీగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది క్విడ్‌ ప్రోకో కాకపోతే మరేంటి? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details