Kadapa Solar Power Projects Delay : జగన్ పాపాలకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకుముందు సర్కార్ కుదుర్చుకున్న కరెంట్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం వల్ల కలిగిన దుష్ప్రభావం విద్యుత్ సంస్థలను కుంగిపోయేలా చేసింది. కడప సౌర విద్యుత్ పార్కులో ప్రతిపాదించిన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అప్పుడే కొనసాగించి ఉంటే ప్రజలపై రూ.2775 కోట్ల అదనపు భారం పడి ఉండేది కాదు.
గత టీడీపీ ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను జగన్ సర్కార్ రద్దు చేసింది. దానిపై కోర్టు కేసులు, విచారణల తర్వాత 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు హడావుడిగా పీపీఏలు కుదుర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. నాలుగున్నరేళ్ల జాప్యం ఫలితంగా సౌర ప్రాజెక్టులపై కేంద్రం విధించిన కొత్త పన్నుల భారాలు భరించక తప్పని పరిస్థితి నెలకొంది. కడపలో ప్రతిపాదించిన సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఒప్పందం ప్రకారం 2020 జూన్ నాటికి పూర్తి కావాలి. మెగావాట్‌కు సగటున 2 మిలియన్ యూనిట్ల చొప్పున ఏడాదికి 15000ల ఎంయూల కరెంట్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు.
ఒప్పందం కుదిరేనాటికి సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కొనుగోలు చేసే ఫలకాలపై బేసిక్ కస్టమ్ డ్యూటీ-బీసీడీని కేంద్రం మినహాయించింది. ఆ ఉత్తర్వులు 2023 మార్చి వరకు అమలవ్వగా ఆ తర్వాత నుంచి దిగుమతి చేసుకునే సౌర ఫలకాలపై 40 శాతం బీసీడీ చెల్లించాలి. ఆ రకంగా యూనిట్‌కు అదనంగా 40 పైసల భారం పడనుందని అంచనా. సౌర ప్యానళ్ల కొనుగోళ్లపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం 5 నుంచి 12 శాతానికి పెంచడం వల్ల యూనిట్‌పై 12 పైసల భారం పడనుంది.