Jagan Cheated People by not Fulfilling Promises:ఎవరైనా ఏప్రిల్ 1 రోజే ఫూల్స్‌ని చేస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం గతంలో ఇచ్చిన హామీలపై నచ్చినప్పుడల్లా నాలుక మడతపెడుతూ ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలను ఫూల్స్‌ని చేస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచీ ప్రజలపై జోక్స్ వేస్తూనే ఉన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే, చేసేసినట్లు చెబుతూ ప్రజల్ని ఫూల్స్‌ని చేస్తూనే ఉన్నారు.
Prohibition of Alcohol:ప్రజలపై జగన్ సంధించిన అతి పెద్ద జోక్ మద్యపాన నిషేధం. అధికారంలోకి వచ్చాక మూడుదశల్లో మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చారు. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేసి ఆ తర్వాతే 2024 ఎన్నికల్లో ఓట్లడుగుతామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం హామీకి మంగళం పాడేశారు. జగన్ అధికారం చేపట్టాక జె-బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షా 20 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిపారు.
Jagan Promise to Farmers:2019 ఎన్నికలకు ముందు రైతుల్ని ఆకట్టుకునేందుకు జగన్ ఊరికో హామీ ఇచ్చారు. రైతులకు ఏటా 12 వేల500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. చెప్పినదాని కంటే మిన్నగా ఏడాదికి 13వేల 500 ఇస్తున్నామని ఇప్పుడు గొప్పలు చెబుతున్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం ఇస్తోంది ఏటా 7వేల 500 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి కింద ఇస్తున్న 6వేలు కూడా కలిపి 13వేల 500 ఇస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నారు. ఇది రైతుల్ని ఫూల్స్ చేయడం కాదా? టమాటా ఎక్కువగా పండే రాయలసీమలో ప్రతి మండలంలోను జ్యూస్ పరిశ్రమలు, 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా చాలా హామీలిచ్చి జగన్ జనాన్ని మభ్యపెట్టారు.
Special Status:'హోదా సాధిద్దాం ఉద్యోగాల విప్లవం తెద్దాం' ఇది వైసీపీ మ్యానిఫెస్టోలోని నినాదం. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్, అధికారంలోకి వచ్చిన వెంటనే దిల్లీ వేదికగా రాష్ట్ర ప్రజల్ని పూల్స్‌ని చేశారు.
Job Calendar:లక్షల మంది నిరుద్యోగులు జగన్ చేతిలో ఫూల్స్ మిగిలిపోయారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడంతో పాటు, ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వైసీపీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ ఐదేళ్లలో ఒక్కసారే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. అది కూడా అరకొర ఉద్యోగాలకే. అటు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, జగన్ అరాచక విధానాలకు భయపడి రాష్ట్రానికి పరిశ్రమలు ముఖం వాటేయడం, ఉన్న పరిశ్రమల్ని ప్రభుత్వం తరిమేయడం, ఐటీ రంగం అభివృద్ధిపై ఎలాంటి శ్రద్ధా పెట్టకపోవడంతో ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల్లేక యువత రాష్ట్రం నుంచి విపరీతంగా వలసపోతోంది. రాష్ట్రంలోని యువతలో వలసల రేటు 31.6 శాతం ఉన్నట్లుగా తాజా నివేదిక పేర్కొంది. దీనికేమంటారు జగన్ అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.