Irregularities in Jagananna Housing Layout in Kadapa District :ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వ భూములు ఆక్రమించి విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వేసి భూ దందాకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లావ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అనధికారికంగా మరో వెయ్యి వరకు ఉంటాయని అంచనా. వీటిపై సమగ్ర విచారణ చేయడానికి టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను నియమించారు. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఈ బృందాలు 3 రోజులపాటు జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించనున్నాయి.
ఇష్టారాజ్యంగా ప్రభుత్వభూములు ఆక్రమణ :వైఎస్సార్సీపీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఉమ్మడి కడప జిల్లాలో ఇష్టారాజ్యంగా ప్రభుత్వభూములు ఆక్రమించారు. రెవెన్యూ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాయడంతో ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయ్యాయి. కబ్జా చేసిన స్థలాల్లో రియల్ ఎస్టేట్ పేరుతో వెంచర్లు వేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. సెంటు స్థలం 10 నుంచి 13 లక్షల వరకు విక్రయిస్తున్నారు. లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేకపోయినా యథేచ్చగా నిర్మాణాలు సాగిస్తున్నారు.
పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు : కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అక్రమ లేఅవుట్లు వెలిశాయి. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 585 అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వీటిలో అత్యధికంగా కడప నగరంలోనే 400 వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై విచారణ చేయాలని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పురపాలకశాఖ మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు.