ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిబంధనలకు నీళ్లు - 'అగ్ని'లో అవినీతి!

అగ్నిమాపక శాఖ డీజీగా అధికార దుర్వినియోగం - వెలుగులోకి సీఐడీ మాజీ అధిపతి సంజయ్​ అక్రమాలు

AP CID EX Chief Sanjay Irregularities
AP CID EX Chief Sanjay Irregularities (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

AP CID EX Chief Sanjay Irregularities :సీఐడీ మాజీ అధిపతి, అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్‌ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అగ్నిమాపకశాఖ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన సమయంలో అధికార హోదాను అడ్డుపెట్టుకొని కోటి రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తేల్చింది. సౌత్రిక టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో కుమ్మకైనట్లు పనుల్లో పురోగతి లేకుండానే భారీ చెల్లింపులు చేసినట్లు నిర్ధారించింది.

బిడ్‌ రిగ్గింగ్‌, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాతానికి, విశ్వాసఘాతుకానికి సంజయ్‌ పాల్పడ్డారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సంజయ్‌పై కేంద్ర సివిల్‌ సర్వీసుల నియమావళి ప్రకారం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. అలాగే సౌత్రిక టెక్నాలజీస్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలని నివేదించింది.

AP Govt Focus on IPS Sanjay : అగ్నిమాపకశాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్‌లైన్‌లో జారీచేసేందుకు వీలుగా. అగ్ని- ఎన్​వోసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కోసం అగ్నిమాపకశాఖ డీజీ హోదాలో సంజయ్‌ 2023లో టెండర్లు పిలిచారు. బిడ్లు సమర్పించేందుకు కొన్ని సంస్థలనే ఆహ్వానించగా 3 కంపెనీలే బిడ్లు వేశాయి. సౌత్రిక టెక్నాలజీస్‌ సంస్థ లోయెస్ట్‌ బిడ్డర్‌ కాకపోయినా ఎల్​-1గా ఎంపిక చేసి కాంట్రాక్టు కట్టబెట్టారు. బిడ్ల సాంకేతిక మదింపు హడావుడిగా ముగించారు. సౌత్రిక సంస్థను ఎల్​-1గా ఎంపిక చేయడంలో ఆ సంస్థ అనుభవం, సమర్థతలను పరిగణనలోకి తీసుకోలేదు.

ఐపాడ్‌లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలోనూ అక్రమాలే : అగ్నిమాపకశాఖ అధికారుల కోసమంటూ ఒక్కో ల్యాప్‌టాప్‌, ఐప్యాడ్‌కు రూ.1.78 లక్షలు వెచ్చించి 10 పరికరాలను సౌత్రిక టెక్నాలజీస్‌ నుంచి సంజయ్‌ కొనుగోలు చేశారు. మార్కెట్‌ ధరల కంటే అధికంగా వెచ్చించి ఆ సంస్థకు రూ.17.89 లక్షలు చెల్లించారు. టెండర్లు, కాంపిటీటివ్‌ బిడ్లు లేకుండానే ఆ సంస్థకు వీటి సరఫరా ఆర్డర్లు ఇచ్చేశారు. కనీసం బిల్లులూ సమర్పించలేదు. దీనిలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయి.
వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కోసం సౌత్రిక టెక్నాలజీస్‌కు రూ.2.29 కోట్లు చెల్లించేలా గతేడాది ఫిబ్రవరి 15న సంజయ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వారంలోగానే ఫిబ్రవరి 22న ఆ సంస్థకు రూ.59.93 లక్షలు చెల్లించేశారు.

ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయినందున మరో రూ.26 లక్షలు చెల్లించాలని అదే రోజున ఆ సంస్థ క్లెయిమ్‌ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం సౌత్రిక టెక్నాలజీస్‌ అగ్ని-ఎన్‌వోసీ వెబ్‌సైట్‌, యాప్‌ కార్యకలాపాలు ప్రారంభించి ట్యాబ్‌లన్నీ సరఫరా చేస్తే 50 శాతం చెల్లించాలి. అలాగే శాఖాపరమైన అంతర్గత సమీక్ష కమిటీ నివేదిక అందిస్తే 25 శాతం సెక్యూరిటీ ఆడిట్‌ పూర్తిచేశాక 20 శాతం బిల్లులు చెల్లింపు చేయాలి. మిగతా 5 శాతాన్ని ఏడాదికోసారి చొప్పున ఐదేళ్లలో చెల్లించాలి. నిర్వహణ ఛార్జీలను 3 నెలలకోసారి ఇవ్వాలి.

ఈ నిబంధనలన్నింటినీ గాలికొదిలేసిన సంజయ్‌ పనుల పురోగతి పరిశీలించకుండానే ఆఘమేఘాలపై ఆ సంస్థకు నిధులు చెల్లించేశారు. 50 శాతం పనులు పూర్తిచేసినట్లు సంస్థ సమర్పించిన తప్పుడు నివేదికల్ని ఆమోదించి బిల్లులు ఇచ్చేశారు. వాస్తవంగా ఎంత పని జరిగిందో పరిశీలించలేదు. ఈ బిల్లులు చెల్లించాలంటూ సంజయ్‌ సంబంధిత అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ సంస్థతో కుమ్మక్కయ్యారు.

గడువులోగా 14 శాతం పనులే - అయినా బిల్లులు ఇచ్చేశారు : 2023 జనవరి 23న అగ్నిమాపకశాఖ డీజీగా బాధ్యతలు చేపట్టిన సంజయ్‌ అదే ఏడాది మార్చి 9 వరకు ఆ పోస్టులో కొనసాగారు. రెండున్నర నెలల్లోనే ఈ అక్రమాలు, నిధుల దుర్వినియోగానికి తెరలేపారు. సంజయ్‌ తర్వాత ఆ పోస్టులోకి వచ్చిన పీవీ సునీల్‌కుమార్‌ అగ్ని పోర్టల్‌ కొనసాగింపుపై సాంకేతిక కమిటీ ఏర్పాటుచేశారు. సౌత్రిక టెక్నాలజీస్‌ సంస్థ 14 శాతం పనులే పూర్తిచేసిందని కమిటీ తేల్చింది. 2023 ఏప్రిల్‌ 15 నాటికి మొత్తం ప్రాజెక్టును అప్పగించాల్సి ఉన్నా గడువులోగా పనులు పూర్తిచేయలేదని నివేదించింది. అయినా ముందస్తుగానే బిల్లులు చెల్లించేశారని పేర్కొంది. దీంతో ఆ సంస్థకు అప్పట్లోనే షోకాజ్ నోటీసులిచ్చారు.


అప్పుడు పెద్దలు చెప్పినదానికల్లా తలూపారు - ఇప్పుడేమో చల్లగా జారుకున్నారు

దేశం దాటుతున్నCID Chief సంజయ్ -భయపడి పారిపోతున్నాడంటూ ట్రోలింగ్‌ - AP CID Chief sanjay on leave

ABOUT THE AUTHOR

...view details