IPS Kolli Raghuram Reddy Targeting TDP Leaders : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పొంగూరు నారాయణ నివాసం, వైద్య కళాశాలకు ఔషధ నియంత్రణ విభాగాధికారులను పంపి ఐపీఎస్ అధికారి, ఔషధ నియంత్రణ విభాగం డైరెక్టర్ జనరల్ కొల్లి రఘురామ్‌రెడ్డి తనిఖీలు చేయించారు. అధికారులు అక్కడ తలుపులు, బీరువాలు పగలగొట్టించి మరీ సోదాలు జరిపారు. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సహా 70 మందికి పైగా పోలీసులతో దండెత్తి నాలుగున్నర గంటల పాటు అలజడి సృష్టించారు. ఇంత చేసినా సరే మందుల క్రయవిక్రయాలకు సంబంధించిన ఎలాంటి పత్రాలూ వారికి లభించలేదు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే సోదాలు జరపాలి. బాధ్యులు ఎంత పెద్దవారైనా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ ప్రతిపక్ష టీడీపీలో క్రియాశీలక నేతే లక్ష్యంగా దాడులు చేయటాన్ని కక్ష సాధింపు చర్యలు అనకపోతే ఇంకేమనాలి? ఏదో ఉగ్రవాద శిబిరంపైకి వెళ్లినట్లు దండెత్తటం వేధించటం కాక మరేమవుతుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షాలపై కక్ష సాధించటానికేనా? :ప్రపంచాన్ని గడగడలాడించే ఐసీస్, బోకోహరామ్ వంటి ఉగ్రవాద సంస్థలు విరివిగా వినియోగించే 'ఐసిస్ డ్రగ్ (ISIS Drug)'గా పేరొందిన 'ట్రెమడాల్ (Tramadol)' మాదకద్రవ్యాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సేఫ్ ఫార్ములేషన్స్ ఔషధ కంపెనీలో మాత్రల రూపంలో తయారుచేసి, విదేశాలకు ఎగుమతి చేస్తున్న ఉదంతాన్ని ముంబై కస్టమ్స్ విభాగం బయటపెట్టినా సరే ఏపీ ఔషధ నియంత్రణ విభాగం ఈ స్థాయిలో అక్కడికి వెళ్లి దాడులు చేయలేదు. పోలీసుల్నీ తీసుకెళ్లలేదు. అలాంటిది నారాయణ వైద్య కళాశాలలోని మందుల దుకాణంలో అనధికారికంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నారని ఫిర్యాదు అందిందంటూ భారీగా పోలీసుల్ని మోహరించి దాడులు చేశారు. ఇది అధికార దుర్వినియోగం కాదా? ఔషధ నియంత్రణ విభాగం ఉన్నది ప్రతిపక్షాలపై కక్ష సాధించటానికా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
పాతాళంలోకి వైసీపీ ప్రభుత్వం: వర్ల రామయ్య
ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ : కొల్లి రఘురామ్‌రెడ్డి గతేడాది మే 4 నుంచి ఔషధ నియంత్రణ విభాగం డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్కటైనా అంతర్‌రాష్ట్ర నకిలీ మందుల ముఠాను పట్టుకోగలిగారా? రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మాదకద్రవ్యాల తయారీ ముఠాల్ని, సరఫరాదారుల్ని, వినియోగాన్ని అడ్డుకోగలిగారా? కనీసం వారిపై దాడులైనా చేశారా? ఈ ప్రశ్నలన్నింటికీ 'లేదు' అనే సమాధానమే వస్తుంది. అలాంటి ప్రధాన విధులు, బాధ్యతల్ని విస్మరించి, ఎన్నికల ముంగిట నారాయణే లక్ష్యంగా దాడులు చేయటమేంటి?