ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు రోజుల పాటు రెక్కీ చేసి ఐఫోన్లు చోరీ - 24 గంటల్లోపే ఇలా దొరికేశారు! - COSTLY PHONES THEFT FROM GODOWN

రూ.2.5 కోట్ల విలువైన యాపిల్‌ ఫోన్లు, ఐప్యాడ్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు దొంగతనం - బిహార్‌లో పట్టుకున్న పోలీసులు

IPhones Theft from Godown in Vijayawada
IPhones Theft from Godown in Vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 12:32 PM IST

IPhones Theft from Godown in Vijayawada: రెండు రోజుల పాటు రెక్కీ చేశారు. ఎట్టకేలకు ఖరీదైన యాపిల్‌ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను చోరీ చేశారు. కానీ చివరకు 24 గంటల గడవక ముందే దొరికిపోయింది ఓ దోపిడీ ముఠా. విజయవాడ శివారు ఎనికేపాడులోని ఓ ఎలక్ట్రానిక్‌ పరికరాల డిస్ట్రిబ్యూటర్‌ గోదాము నుంచి రూ.2.5 కోట్లు విలువ చేసే ఖరీదైన ఫోన్లు, వస్తువులు చోరీకి గురయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ రూరల్‌ మండలం ఎనికేపాడులో ఇన్‌గ్రాం మైక్రో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గోదాము నిర్వహిస్తోంది. యాపిల్‌ ఉత్పత్తులతో పాటు ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను షోరూమ్‌లకు సరఫరా చేస్తుంటారు. ఈ నెల 5వ తేదీ అర్థరాత్రి 12.58 గంటల సమయంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు గోదాము వెనుక వైపు గోడ దూకి ప్రవేశించారు. ముందు వైపు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా వీరిని గమనించలేదు. గోడౌన్​ ఆనుకుని వాటర్‌ ట్యాంకు కోసం నిర్మించిన గదిపైకి ఎక్కి కట్టర్‌తో రేకులు కత్తిరించి చొరబడ్డారు. లోపల ఉన్న సీసీ కెమెరాల కేబుళ్లు కట్‌ చేశారు.

గోదాములో రూ.6 కోట్లు విలువైన వస్తువులు:గోదాములో యాపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్, తదితర కంపెనీలకు చెందిన రూ. 6 కోట్లు విలువ చేసే ఫోను, ల్యాప్‌ట్యాప్‌లు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉన్నాయి. వీటిలో నుంచి కేవలం ఖరీదైన వస్తువులను ఎంచుకుని మరీ దొంగిలించారు. 171 యాపిల్‌ ఐఫోన్లు, 75 యాపిల్‌ ఇయర్‌ బడ్స్, రెండు ఐప్యాడ్‌లతో పాటు రూ. 2.5 కోట్లు విలువ చేసే 371 వస్తువులను చోరీ చేసి గోడ దూకి బయటపడ్డారు. రోడ్డుపై వీరి కోసం ఆగి ఉన్న మరో వ్యక్తితో కలిసి మధ్యప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న మారుతీ ఎర్టిగా కారులో గన్నవరం వైపుగా వెళ్లారు.

రెండు రోజుల పాటు రెక్కీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ ముఠా ఈనెల ఒకటో తేదీన రాష్ట్రానికి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. 4వ తేదీన నగరానికి చేరుకుని గోదాము ఉన్న ప్రాంతాన్ని చేరుకున్నారు. రెండు రోజుల పాటు పరిసర ప్రాంతాల్లో రెక్కీ చేశారు. ఎటు నుంచి గౌడౌన్‌ లోపలికి వెళ్లాలి? కారు ఎక్కడ నిలపాలి? చోరీ అనంతరం ఎటు వైపు నుంచి రావాలి? అని పక్కాగా రెక్కీ నిర్వహించి దాన్ని పకడ్బందీగా అమలు చేశారు. బుధవారం అర్థరాత్రి గోదాములోకి ప్రవేశించిన వీరు, తెల్లవారుజామున 3 గంటలకు బయటకు వచ్చారు. సుమారు గంట పాటు కారులోకి తాపీగా వస్తువులు సర్దుకుని వెళ్లిపోయారు.

ఫాస్టాగ్‌ ఆధారంగా కారు వివరాలు: గురువారం ఉదయం 9 గంటలకు విధులకు వచ్చిన సిబ్బంది చోరీ జరిగిందని గుర్తించి ఇన్‌ఛార్జికి తెలిపారు. గురువారం సాయంత్రం పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఎనికేపాడు సెంటర్‌ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం వైపు వెళ్తున్నట్లు నమోదైంది. వెంటనే అప్రమత్తమై కారు నెంబర్‌ ఆధారంగా ఫాస్టాగ్‌ వివరాలను తీశారు. చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నట్లు ఈ మార్గంలోని టోల్‌గేట్లలో రికార్డు అయింది. వీరు ఒడిశా దాటి బిహార్‌లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుసుకుని, అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.

అక్కడి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం వాహనంతో పాటు నిందితులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారాన్ని నగర పోలీసులకు అందించారు. దీంతో నిందితులను అదుపులోకి విజయవాడకు తీసుకొచ్చేందుకు రెండు బృందాలు శుక్రవారం సాయంత్రం బయలుదేరి వెళ్లాయి. ఎలక్ట్రానిక్‌ గోదాములనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతుంటుందని తేలింది. భారీ చోరీకి సంబంధించిన వివరాలను ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

"దొంగ తెలివి" ఇంట్లో సెల్​ఫోన్ చోరీ - తిరిగి దుకాణంలో వాళ్లకే బేరం పెట్టిన ఘనుడు

సీసీ కెమెరాల నుంచి తప్పించుకున్నాడు - టాటూతో దొరికేశాడు!

ABOUT THE AUTHOR

...view details