Anti Drug Awareness Rally in Telangana :అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పలు జిల్లాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో ఎస్పీ అశోక్ కుమార్ ర్యాలీని ప్రారంభించారు. హనుమకొండ జిల్లా పరకాలలో బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎవరైనా డ్రగ్స్ అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పరకాల ఏసీపీ కిషోర్‌కుమార్ హెచ్చరించారు. హనుమకొండలో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో అదాలత్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ తీశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట డ్రగ్స్ మహమ్మారి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహబూబాబాద్‌లో కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Anti Drug Abuse Rally in mahabubabad :జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, యువత మత్తులో చిత్తవుతున్నారని, మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, డ్రగ్స్‌ను విక్రయించినా, రవాణా చేసినా, వినియోగించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.