Interesting Conversation between Chandrababu and Lokesh : ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు గుంటూరు జిల్లా పెనుమాక నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం వేదికైంది. ఈ సందర్భంగా గతంలో పరదాల ముఖ్యమంత్రిని చూశామని, ఇప్పుడు ప్రజల సీఎంను చూస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అధికారులు సెట్ అయ్యేందుకు ఇంకా టైమ్ పడుతుందనుకుంటా సర్, ఇంకా పరదాలు కడుతున్నారని చంద్రబాబుకు వివరించారు.
దీనికి చంద్రబాబు బదులిస్తూ 'లేదు సెట్ అయ్యారు' అని చెప్పారు. కొంతమంది ఇంకా పరదాలు కట్టడం మానుకోలేదని, బతిమిలాడి తీయిస్తున్నామని లోకేశ్ వివవరించారు. మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టినవారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
పాత రోజులు మరిచిపోవాలి : ఎవరైనా సరే పాత రోజులు మరిచిపోవాలని చంద్రబాబు అన్నారు. ఫిర్యాదులు వస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. రివర్స్ పోయే బండిని పాజిటివ్ వైపు నడిపిస్తున్నామని చెప్పారు. స్పీడ్ పెంచడం తప్ప వెనక్కి వెళ్లే పరిస్థితి ఎవరికీ ఉండకూడదని అన్నారు. ఆ ఆలోచనే రాకూడదని వివరించారు. అలా ఉండకపోతే ఒక్క షాక్ ట్రీట్‌మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారని పేర్కొన్నారు. దానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.