Intelligence Department Woman SP Suspend :ఎవరైనా అవినీతికి పాల్పడితే దండించే పోలీసులే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇవ్వని వ్యాపారులను బెదిరిస్తున్నారు. అప్పుల పేరుతో డబ్బులు తీసుకొని, తిరిగి ఇవ్వమంటే వాళ్లకున్న అధికార బలంతో బెదిరిస్తున్నారు. ఇలా పోలీసులే వసూళ్లు చేస్తే రౌడీల నుంచి ప్రజలను ఎవరు రక్షిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటెలిజెన్స్‌లో పని చేస్తూ అక్రమ వసూళ్లు :తాజాగా ఇంటెలిజెన్స్‌లో పని చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఓ మహిళా ఎస్పీపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇంటెలిజెన్స్ విధుల నుంచి తప్పించి శుక్రవారం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. రాష్ట్రంలోని కీలకమైన జిల్లాను పర్యవేక్షించే బాధ్యతల్లో ఉన్న ఆమె వ్యవహారం శ్రుతిమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
అప్పులు తిరిగివ్వాలని కోరితే : ఏడేళ్ల క్రితం ఆ జిల్లాలో డీఎస్పీగా చేరి ప్రస్తుతం ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెపై ఇటీవల కాలంలో చాలా ఫిర్యాదులు వచ్చాయి. తన సిబ్బందితో పాటు కింది స్థాయి అధికారుల నుంచి అప్పు రూపకంగా, చేబదులు రూపంలో రూ.లక్షల్లో డబ్బులు తీసుకున్నారని, తిరిగి ఇవ్వమని కోరితే ఇంటెలిజెన్స్ నివేదికల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.